నిండు గర్బిణిని బుట్టలో మోసుకెళ్ళి కాన్పు చేయించారు

నిండు గర్బిణిని బుట్టలో మోసుకెళ్ళి కాన్పు చేయించారు

ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్ని పధకాలు ప్రవేశ పెట్టినా మారు మూల పల్లెజనాలకు అవి అందటంలేదు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఇదే జరిగింది. అడవిలో ఉన్న ఒక గ్రామానికి సరైన రహాదారి లేకపోవటంతో నిండు గర్భిణినీ ఆస్పత్రికి తీసుకువెళ్లటానికి చాలా ఇబ్బందులు పడ్డారు.

కొండగావ్ జిల్లా మెహన్బిదా గ్రామానికి చెందిన ఒక మహిళ గర్బవతి అయి నెలలు నిండాయి. ఆమెకు మంగళవారం నొప్పులు రావటంతో అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటంతో అంబులెన్స్ గ్రామంలోని రాలేదు. ఆ గర్భిణీ పరిస్థితిని గమనించిన ఆరోగ్య కార్యకర్తలు ఒక కర్రకు బుట్టను కట్టి అందులో ఆమెను ఉంచి ఆస్పత్రి వరకు మోసుకొని వెళ్లారు.

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కొండగావ్ జిల్లా వైద్య అధికారి టీఆర్ కన్వర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ గ్రామానికి అంబులెన్స్ వెళ్లలేకపోయిందని చెప్పారు.

దీంతో ఆరోగ్య కార్యకర్తలు ఆమెను కర్రకు కట్టిన బుట్టలో మోసుకుని ఆస్పత్రికి తీసుకు వచ్చారని తెలిపారు. అనంతరం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా… అక్కడ సుఖ ప్రసవం జరిగిందన్నారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పారు.