UPSC ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు సుప్రీం నిరాకరణ

  • Published By: venkaiahnaidu ,Published On : September 30, 2020 / 04:42 PM IST
UPSC ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు సుప్రీం నిరాకరణ

prelims 2020 exam సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) అక్టోబ‌ర్ 4నే సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నుంది. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని 20మంది యూపీఎస్సీ ఆశావహులు వేసిన పిటిషన్​పై జస్టిస్ ఏఎం ఖాన్​విల్కర్, జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ కృష్ణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది.



2021లో జరిగే పరీక్షలతో ప్రస్తుత(2020) పరీక్షలను నిర్వహించాలనే వాదనను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. అయితే ఈ ఏడాది పరీక్ష తమకు చివరి అవకాశంగా ఉన్న అభ్యర్థులకు అదనపు అవ‌కాశం క‌ల్పించే అంశాన్ని పరిశీలించాలని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కేంద్రాన్ని ఆదేశించింది. కరోనా కారణంగా హాజరుకాలేని ఈ అభ్యర్థులకు మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పించడాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.


కాగా,పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని యూపీఎస్సీ ఇదివరకే కోర్టుకు తేల్చిచెప్పింది. ఇదివరకే ఓసారి పరీక్ష వాయిదా పడినందున మరోసారి అలా చేయడం కుదరదని స్పష్టం చేసింది. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ధర్మాసనానికి వివరించింది.