అయోధ్య రామాలయానికి కోట్లలో విరాళాలు

అయోధ్య రామాలయానికి కోట్లలో విరాళాలు

అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే బడా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది కోట్లలో విరాళాలు ఇవ్వగా.. ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌, విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కలిసి శుక్రవారం నుంచి విరాళాల సేకరణ ప్రారంభించగా.. దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలి విరాళంగా రూ. 5,00,100 చెక్కును రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులకు అందించారు.

వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరైన సూరత్‌లోని పలువురు వ్యాపారులు మందిర నిర్మాణంకు కోట్లలో విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్‌ భాయ్‌ డోలాకియా.. ఆలయ నిర్మాణం కోసం రూ. 11 కోట్లు విరాళంగా అందజేశారు. శుక్రవారం స్థానిక విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయానికి వెళ్లి చెక్కును ఆయన అందజేశారు. సూరత్‌కు చెందిన మరో వ్యాపారి మహేశ్‌ కబూతర్‌వాలా కూడా రూ. 5కోట్లు, లవ్‌జీ బాద్‌షా రూ. కోటి విరాళంగా ఇచ్చారు.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 15 నుంచి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఫిబ్రవరి 27 వరకు సాగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలు సేకరించాలని ట్రస్ట్ భావిస్తోంది. నిధుల సేకరణలో పారదర్శకత కోసం రూ. 20వేలు అంతకంటే ఎక్కువ డబ్బులు విరాళంగా ఇస్తే.. దానిని చెక్కుల రూపంతో తీసుకోబోతోంది ట్రస్ట్. రూ. 2వేల కంటే ఎక్కువ ఇస్తే వారికి రశీదు ఇస్తోంది. విరాళాల సేకరణలో విదేశీ నిధులకు ఆస్కారం లేకుండా చూడాలని ట్రస్ట్‌ భావిస్తోంది.