కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి

KOVIND భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయన తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత ఆయన ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఇక,రెండో దశ వ్యాక్సిన్ ప్రారంభమైన తొలిరోజే(మార్చి-1,2021)ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పలువురు కేంద్రమంత్రులు,పలు రాష్ట్రాల గవర్నర్ లు,సీఎంలు,ఎంపీలు,ఎమ్మెల్యేలు వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా 1.54కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు రాగానే ఎలాంటి సంకోచాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. స్థోమత ఉన్న వారు వ్యాక్సిన్‌కు డబ్బు చెల్లించి వేయించుకోవచ్చని సూచించారు. కాగా, ప్రభుత్వ కో-విన్ పోర్టల్‌లో 50 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేయించుకున్నారు.

ఇక వ్యాక్సిన్ పంపిణీ సమయంపై ఉన్న ఆంక్షలను కూడా తొలగించినట్లు హర్షవర్థన్ తెలిపారు. ప్రజలు వారికి అనువైన సమయంలో 24×7 ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని హర్షవర్ధన్​ తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో పాటు సమయానికి ఉన్న విలువను ప్రధాని నరేంద్ర మోడీ అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ట్వీట్​ చేశారు.