బీజేపీ కొత్త ఎత్తుగడ : ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుందా... అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. మహా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంటే... బీజేపీ-శివసేన ఎవరి దారులు వారు

  • Published By: veegamteam ,Published On : November 2, 2019 / 01:56 AM IST
బీజేపీ కొత్త ఎత్తుగడ : ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుందా… అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. మహా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంటే… బీజేపీ-శివసేన ఎవరి దారులు వారు

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుందా… అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. మహా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంటే… బీజేపీ-శివసేన ఎవరి దారులు వారు వెతుక్కుంటున్నాయి. సీఎం పీఠంపై పట్టువీడని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోంది. బీజేపీ కూడా ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్‌ లేకపోలేదు. ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయ్.. నవంబర్ 7లోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఇక రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ బిజెపి నేత ముంగంటివార్ కామెంట్ చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.. ఫలితాలొచ్చి వారం దాటిపోయినా..ఇంకా శివసేనతో వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో బిజెపి కొత్త ఎత్తుకి తెరలేపిందేమో అన్న సందేహాలు మొదలయ్యాయ్. మరోవైపు సిఎం సీటు ఐదేళ్లూ మాదంటూనే.. శివసేనతో బంధం ఫెవికాల్‌ లాంటిందటూ బిజెపి కామెంట్ చేస్తోంది.. ముఖ్యమంత్రి పీఠం తమకిస్తేనే ప్రభుత్వంలో చేరతామంటున్న శివసేన అవసరమైతే మేమే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటోంది.. శివసేన కోరితే మద్దతు ఇస్తామంటూనే కాంగ్రెస్.. ప్రతిపక్షపాత్రకే పరిమితమవుతామంటోంది..ఇలా ప్రతి పార్టీకూడా రెండు రకాలుగా వ్యవహరిస్తుండటంతో మహానాటకం రక్తి కడుతోంది..

ప్రస్తుతమున్న సంఖ్యా బలాలను బట్టి చూస్తే.. బీజేపీకి కొందరి ఇండిపెండెంట్ల మద్దతు ఉన్నప్పటికీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య మాత్రం లేదు. దీంతో శివసేనపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. శివసేనతో కలిసినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు సాఫీగా సాగిపోతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపధ్యంలో అది జరిగేట్లు లేదు. ఇక శివసేన విషయానికి వస్తే 56మంది ఎమ్మెల్యేలున్న శివసేనకు ఎన్సీపీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది.

ఇక్కడే మరో సమీకరణం కూడా తెరపైకి వస్తోంది. బీజేపీ ఎన్సీపీ మద్దతు కూడగట్టగలిగితే శివసేనకు చెక్‌ పెట్టే అవకాశముంది. ప్రధాని మోడీకీ శరద్‌ పవార్‌తో మంచి సాన్నిహిత్యమే ఉంది. బీజేపీకి 105  ఎమ్మెల్యేలుండగా…ఎన్సీపీకీ చెందిన 54 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలుంది. రోజుకో మలుపు తిరుగుతున్న మహారాష్ట్రలో ఈ ఈక్వేషన్‌కి అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు రాజకీయ పండితులు.