కరోనా వ్యాక్సిన్ డిప్లమసీని ఆయుధంగా ఉపయోగిస్తున్న ప్రధాని మోడీ

  • Published By: bheemraj ,Published On : November 28, 2020 / 05:18 PM IST
కరోనా వ్యాక్సిన్ డిప్లమసీని ఆయుధంగా ఉపయోగిస్తున్న ప్రధాని మోడీ

PM Modi focus corona vaccine : కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యాక్సిన్ డిప్లమసీని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. దేశాన్ని వ్యాక్సిన్ తయారీహబ్ గా మార్చాలని భావిస్తున్నారు. ఇతర దేశాలతో సత్సంబంధాలను పెంచుకునే వ్యూహంతో ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మన దగ్గర్నుంచే వ్యాక్సిన్ సరఫరా చేసే ఆలోచనలో ఉన్నారు.



వ్యాక్సిన్ రవాణా కోసం రిఫ్రిజిరేటెడ్ బాక్సులపై ప్రధాని దృష్టి పెట్టారు. వచ్చే వారం లక్సంబర్గ్ కు చెందిన బీ మెడికల్ సిస్టమ్స్ ప్రతినిధులు గుజరాత్ కు రానున్నారు. లక్సంబర్గ్ కంపెనీ గుజరాత్ లో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.



దేశానికి భారీగా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. భారత దేశంలో 16 సంస్థలకు వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇంత సామర్థ్యం ప్రపంచంలోనే మరే దేశానికి లేదు.

వ్యాక్సిన్ ఉత్పత్తిలో జైడస్ కాడిల్లా, భారత్ బయోటెక్, సీరం, డాక్టర్ రెడ్డీస్, హెటిరో, బయోలాజికల్ ఈ, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ తలమునకలయ్యాయి.



భారత్‌ బయోటెక్‌ కంపెనీ, ఐసీఎంఆర్‌ సంయుక్తంగా కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. పూణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ అందించిన కరోనా స్ట్రెయిన్‌తో కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటికే తొలి రెండు దశల ప్రయోగాలు పూర్తై, సానుకూల ఫలితాలు వెలువడ్డాయి.



దీంతో మూడో దశ క్లినికల్‌ టెస్ట్‌లు ప్రారంభమయ్యాయి. భారత్‌ బయోటెక్‌ మూడో దశలో ఏకంగా 26 వేల మందిపై ప్రయోగాలు చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ సక్సెస్‌ అయి అనుమతులు వస్తే ఏటా 30 కోట్ల డోసుల ఉత్పత్తి జరుగనుంది.