మోడీకి UAE అత్యున్నత పౌర పురస్కారం

  • Published By: venkaiahnaidu ,Published On : August 24, 2019 / 12:07 PM IST
మోడీకి UAE అత్యున్నత పౌర పురస్కారం

UAEలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఇవాళ(ఆగస్టు-24,2019)”ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌” మెడల్‌తో యూఏఈ యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ మోడీని సత్కరించారు. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, దేశాధినేతలు, రాజులకు బహూకరించే ఈ అవార్డు యూఏఈలోనే అత్యున్నత పౌర పురస్కారం కావడం విశేషం. భారత్‌, యూఏఈల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా నరేంద్రమోడీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును అందజేశారు.

గతంలో ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌, సాదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ తదితరులు అందుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ రెండు నెలల క్రితం ప్రధాని మోడీకి జాయెద్ మెడల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

యూఏఈ పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ బహ్రెయిన్ కి బయల్దేరారు. రెండు రోజులు మోడీ బహ్రెయిన్ లో పర్యటించనున్నారు. మోడీని సాగనంపేందుకు యూఏఈ యువరాజు కూడా మోడీతో పాటు ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లారు.