నువ్వు దేవతవమ్మా.. స్కూల్ ఫీజు మాఫీ చేయడమే కాదు 1500మంది పేదల కడుపు నింపుతున్న ప్రిన్సిపాల్

  • Published By: naveen ,Published On : July 27, 2020 / 09:01 AM IST
నువ్వు దేవతవమ్మా.. స్కూల్ ఫీజు మాఫీ చేయడమే కాదు 1500మంది పేదల కడుపు నింపుతున్న ప్రిన్సిపాల్

ఫీజుల పేరుతో లక్షలు లక్షలు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల గురించి విన్నాం. ఫీజు కట్టలేని విద్యార్థులతో అమానుషంగా వ్యవహరించిన ప్రిన్సిపాళ్లు, టీచర్ల గురించి విన్నాము. ఇలాంటి వార్తలు విన్న ప్రతిసారి గుండె తరుక్కుపోతుంది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల తీరుపై కోపం వస్తుంది. కానీ, అందరూ అలాంటి వారే ఉండరు. వారిలోనూ కొందరు దేవుళ్లు, దేవతలు ఉంటారు. పెద్ద మనసుతో ఆలోచన చేసేవాళ్లు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వాళ్లూ ఉన్నారు. ఫీజులే పరమావధి కాదు మానవత్వం, మంచితనం, పరోపకారం, దయాగుణం ముఖ్యం అని చాటి చెప్పే వాళ్లూ ఉన్నారు. ఆ కోవకే వస్తారు ఈ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్.

3నెలల స్కూల్ ఫీజు మాఫీ, 1500మందికి రేషన్ సరఫరా:
కరోనా లాక్ డౌన్ కారణంగా పేదలు తీవ్రమైన దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పనులు లేవు, ఆదాయం లేదు. ఒక పూట తినడానికి తిండి కూడా లేదు. అలాంటి ఈ కష్టకాలంలో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పెద్ద మనసు చూపించారు. తన దగ్గర చదువుకునే విద్యార్థులకు అండగా నిలిచారు. వారి స్కూల్ ఫీజు మాఫీ చేశారు. అంతేకాదు ఏకంగా 1500 మంది పేదల ఆకలి కూడా తీరుస్తున్నారు.

బ్యాంకులో దాచుకున్న 4లక్షలతో పేదల కడుపు నింపుతున్న ప్రిన్సిపాల్:
మహారాష్ట్రలోని మలాడ్ కు చెందిన ఓ జంట కరోనా కష్టకాలంలో తమ ఔదార్యం చాటుకుంది. లాక్ డౌన్ సమయంలో పేదలకు ఏ విధంగా సాయం చేయొచ్చు అనేది ఈ జంట చేసి చూపింది. తన స్నేహితుల సాయంతో ఈ జంట పేద విద్యార్థులకు విద్య నేర్పిస్తోంది. అదే సమయంలో మురికివాడల్లో నివాసం ఉండే పేదలకు తిండి పెడుతున్నారు. ప్రతి రోజూ రెండు పూటల వారి కడుపు నింపుతున్నారు. సుమారు 1500మంది ఆకలి కేకలు తీరుస్తున్నారు. ఇందుకోసం ఆ జంట తమ బ్యాంకు ఖాతాలో దాచుకున్న రూ.4లక్షలు ఖర్చు చేశారు.

స్కూల్ ఫీజు మాఫీ:
మీర్జా షేక్.. మలాడ్ లోని మాల్వాణిలో నివాసం ఉంటారు. ఆమె ఓ చిన్న స్కూల్ ప్రిన్సిపాల్. లాక్ డౌన్ కారణంగా ఆమె కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆమె ఇతరుల గురించి ఆలోచించారు. లాక్ డౌన్ కారణంగా తాము స్కూల్ ఫీజు కట్టలేము అని విద్యార్థులు ఆమెతో మొరపెట్టుకున్నారు. వారి మొర ఆలకించిన మీర్జా షేక్, ఫీజుల గురించి మీరు అస్సలు పట్టించుకోవద్దు. మీరు కేవలం చదువు మీద మాత్రమే దృష్టి పెట్టండి అని చెప్పారు. అంతేకాదు మూడు నెలల స్కూల్ ఫీజుని మాఫీ కూడా చేశారామె.

పిల్లల కష్టాలు విని చలించిన ప్రిన్సిపాల్:
తన దగ్గర చదువుకునే పిల్లల్లో చాలామంది పేదలే అనే విషయం మీర్జాకు తెలుసు. వారి ఇళ్లలో ఒక్కటే స్మార్ట్ ఫోన్ ఉంది. దీంతో ఆన్ లైన్ క్లాసులకు ఇబ్బందులు పడేవారు. అంతేకాదు చాలామంది పిల్లలు రెండు పూటల తిండి కూడా తినేవారు కాదని తెలుసుకున్నారు. దీనికి కారణం లాక్ డౌన్. కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వల్ల వారి తల్లిదండ్రులకు పనులు దొరకలేదని, దీంతో పిల్లలు పస్తులు ఉండే పరిస్థితి వచ్చిందని మీర్జా వాపోయారు.

భర్త, ఫ్రెండ్స్ సాయంతో మురికివాడల్లోని ఉన్న పేదలకు ఆహారం అందజేత:
ఈ విషయం తెలిశాక మీర్జా చలించిపోయారు. పెద్ద మనసుతో వారి కడుపులు నింపాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం గురించి తన భర్త ఫయాజ్ కి చెప్పారు. ఆయన భార్యకు తోడుగా నిలిచారు. వెంటనే తమ భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో దాచుకున్న రూ.4లక్షల డబ్బు బయటకు తీశారు. అలాగే తమ ఫ్రెండ్స్ సాయం తీసుకున్నారు. ఆ డబ్బుతో మలాడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికివాడల్లో ఉండే పేదలకు రేషన్, ఆహారం అందచేశారు. వారి ఆకలి కేకలు తీర్చారు.

నువ్వు దేవతవమ్మా, చల్లగా ఉండాలమ్మా:
మీర్జా షేక్, ఆమె భర్త చేసిన సాయం పట్ల పేదలు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమ కడుపులు నింపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మీర్జా షేక్, ఆమె భర్తని దేవుళ్లతో పోల్చారు. నేను ఆటో డ్రైవర్ ని. లాక్ డౌన్ లో నా చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. పనికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో చాలా ఇబ్బందుల్లో ఉన్నా. నా కుటుంబానికి తిండి కూడా పెట్టలేని దుర్భర స్థితి. ఇలాంటి సమయంలో మీర్జా షేక్ దంపతులు గొప్ప సాయం చేశారు. మాకు రేషన్ ఇచ్చి మా కుటుంబం ఆకలి తీర్చారు. వారు నిజంగా దేవుళ్లు అని ఆటో డ్రైవర్ అహ్మద్ అన్నాడు. కష్టకాలంలో స్కూల్ ఫీజులు మాఫీ చేయడమే కాకుండా, పేదల కడుపులు నింపుతున్న ప్రిన్సిపాల్ ను స్థానికులు దేవతతో పోల్చారు. ఆ ప్రిన్సిపాల్, ఆమె భర్త, ఆమె ఫ్రెండ్స్ అంతా చల్లగా ఉండాలని దీవించారు.

సాయం చేయాలంటే కోటీశ్వరుడే కావాల్సిన అవసరం లేదు:
పేదలకు ఇంత సాయం చేసిన ఆ ప్రిన్సిపాల్ బాగా డబ్బున్న వ్యక్తి అనుకుంటే పొరపాటే. ఆమెది మధ్య తరగతి కుటుంబం. కష్టపడి పని చేస్తేనే ఆదాయం వస్తుంది. ఇల్లు గడుస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఆమె కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయినా పెద్ద మనసుతో ఆలోచన చేశారు. సాయం చేయాలని నిర్ణయించారు. తన దగ్గర ఉన్న డబ్బుతోనే 1500మంది పేదల ఆకలి తీర్చారు. సాయం చేయడానికి మంచి మనసు ఉండాలి, డబ్బు ముఖ్యం కాదని ఈ ప్రిన్సిపాల్ చాటి చెప్పారు. లాక్ డౌన్ సమయంలో పేదలకు తమ చేతనైన సాయం ఎలా చేయాలో ఈ ప్రిన్సిపాల్ చూపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మనసున్న వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం అని అంటున్నారు. హ్యాట్సాఫ్, రియల్ హీరో అంటూ ఆ ప్రిన్సిపాల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.