Bihar : రాష్ట్రంలో మద్య నిషేధం .. స్టేషన్‌లోనే ఖైదీలతో కలిసి పోలీసుల మందు పార్టీ

మధ్యపాన నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రంలో ఏకంగా స్టేషన్ లోనే పోలీసులు ఖైదీలతో కలిసి మద్యం సేవించిన ఘటన కలకలం రేపింది. దీంతో పోలీసులతో పాటు ఖైదీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Bihar : రాష్ట్రంలో మద్య నిషేధం .. స్టేషన్‌లోనే ఖైదీలతో కలిసి పోలీసుల మందు పార్టీ

cops..Prisoners liquor party police station..cops held In Bihar

Bihar : అది మద్యపాన నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రం బీహార్. ప్రజలు పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోకుండా చూడాల్సిన పోలీసులే స్టేషన్ లోనే మందుకొట్టారు. అదేనండీ మద్యం సేవించారు. పైగా ఖైదీలతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. బీహార్ రాజధాని పట్నా జిల్లాలోని పాలిగంజ్‌లో ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు,ఖైదీలు కలిసి మద్యం సేవించారు. గురువారం (డిసెంబర్ 1,2022) ఇద్దరు పోలీసులు ఐదుగురు ఖైదీలు కలిసి మద్యం సేవిస్తూ అడ్డంగా బుక్అయ్యారు. ఈ నిర్వాకంతో ఇద్దరు పోలీసులతో పాటు ఐదుగురు ఖైదీలను పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మద్యం సేవించిన పోలీసులకు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. పోలీసు సిబ్బంది గానీ, ఖైదీలకు సంబంధించిన వ్యక్తులు గానీ స్టేషన్‌లోకి మద్యం తీసుకొచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.

మంగళవారం (నవంబర్ 29,2022) మధ్యాహ్నం ఎక్సైజ్‌ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. ఈక్రమంలో ఆ రోజు రాత్రి స్టేషన్ కు మద్యం చేరింది. దీన్ని ఎవరు తెచ్చారు?అనేది తేలాల్సి ఉంది. అలా వచ్చిన మద్యంతో అసలే మద్యపాన నిషేధం ఉండటంతో పోలీసులకు కూడా దాన్ని చూస్తే నోరు ఊరి ఉంటుంది. దీంతో వారు పార్టీలో మజా చేశారు. పైగా ఖైదీలతో కలిసి మందుపార్టీ మొదలుపెట్టారు. ఇదికాస్తా ఓ వ్యక్తిచేసిన అత్యుత్సాహం బయటపెట్టింది. చేతిలో ఫోన్ ఉందికదా షేర్ చేసేద్దామనే ఉత్సాహం మందుపార్టీలో జాయిన్ అయిన పోలీసుల కొంప ముంచింది. మద్యం తాగేవారిలో ఒకరు దీన్ని వీడియో తీసి తన కుటుంబసభ్యులకు పంపాడు.

తనకు పోలీస్‌ కస్టడీలో ఎటువంటి ఇబ్బంది లేదని చక్కగా హ్యీపీగా పోలీసులతోనే కలిసి మందుకొడుతున్నాను మీరేమీ టెన్షన్ పడొద్దు అని చెప్పటానికి ఆ వీడియోను షేర్ చేస్తు అసలు విషయం తెలిపాడు. అయితే..ఒకరి నుంచి మరొకరికి వెళ్లిన వీడియో అలాగే ఉంటుందా ఏంటీ..షేర్..షేర్ అంటూ పెంట అయిపోయింది.

అలా ఈ వీడియోలో సియారామ్‌ మండల్‌, ఛోటే లాల్‌ మండల్‌ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఖైదీలతో కలిసి ఉన్నట్లు కనిపించడం కలకలం రేపింది. ఆ వీడియో వైరల్‌గా మారి.. పట్నాలోని సీనియర్‌ అధికారుల వద్దకు చేరింది. చివరికి పాలిగంజ్‌ పోలీసుల దృష్టికి కూడా రావడంతో హుటాహుటిన ఆఘమేఘాలమీద వచ్చి మందుపార్టీ జరిగే ఎక్సైజ్‌ స్టేషన్‌కు చేరుకొని పార్టీని ఆపారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఖైదీలు లాకప్‌లోనే ఉన్నారు. మరి జరగాల్సిన అనర్థం జరిగిపోయేసరికి మొత్తం అందరు బుక్ అయిపోయారు అడ్డంగా..

ఈ ఘటనపై డివిజనల్‌ అధికారి అవదేష్‌ దీక్షిత్‌ మాట్లాడుతూ..ఖైదీలు మద్యం పార్టీ చేసుకుంటున్న వీడియో మా దృష్టికి వచ్చిందని..వెంటనే మేము ఎక్సైజ్‌ స్టేషన్‌పై రైడ్‌ చేసి వారిని అదుపులోకి తీసుకొన్నామని తెలిపారు. మద్య నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రంలోకి వారికి మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు.