UP Lakhimpur Kheri : లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్తం, ప్రియాంక గాంధీ అరెస్టు ?

సోమవారం తెల్లవారు జామున 5గంటల 30 నిమిషాలకు ప్రియాంక గాంధీ వాద్రాను అరెస్ట్ చేశారని, ఆమెను వేర్వేరు వాహనాల్లో తిప్పారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

UP Lakhimpur Kheri : లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్తం, ప్రియాంక గాంధీ అరెస్టు ?

Priyanka

Priyanka Gandhi Arrested :  ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తోన్న కారు కింద పడి నలుగురు రైతులు దుర్మరణం పాలు కావడం, ఆ తరువాత చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో మరో నలుగురు మృతి చెందడంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఈ క్రమంలో…కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ..మృతుల కుటుంబాలను పరామర్శించడానికి లఖింపూర్ ఖేరికి బయలుదేరి వెళ్లారు. అయితే..అమెను పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధంలో ఉంచారు. అయిదు గంటల పాటు ప్రియాంకా గాంధీ వాద్ర హౌస్ అరెస్ట్‌లో గడిపారు.

Read More : రైతులపైకి దూసుకెళ్లిన మంత్రుల కాన్వాయ్‌.. యూపీలో చెలరేగిన హింస

ఆ తర్వాత ఆమె పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నారు. పార్టీ నాయకుల కారులో లఖింపూర్‌కు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హర్గావ్ వద్ద ఆమెను మళ్లీ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 2021, అక్టోబర్ 04వ తేదీ సోమవారం తెల్లవారు జామున 5గంటల 30 నిమిషాలకు ప్రియాంక గాంధీ వాద్రాను అరెస్ట్ చేశారని, ఆమెను వేర్వేరు వాహనాల్లో తిప్పారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హర్గావ్ నుంచి సీతాపూర్ జిల్లాకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లఖింపూర్‌ ఘటనలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలను పరామర్శించడానికి అనుమతి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. ఈ సందర్భంగా..పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంక. తనకు వారెంట్ చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.

Read More : UP Violence: కేంద్రమంత్రి కొడుకుపై మర్డర్ కేసు

పోలీసులు, ప్రభుత్వం ఎంతగా అడ్డుకున్నా.. తాము లఖింపూర్ చేరుకుంటామని స్పష్టం చేశారు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు. కారులో వెళుతూ.. లఖింపూర్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించడాన్ని యోగి సర్కార్ అడ్డుకుంటోందని ఆరోపించారు ప్రియాంకగాంధీ. తాము అల్లర్లను ప్రోత్సహించడానికో.. ఆందోళనకారులను రెచ్చగొట్టడానికో వెళ్లట్లేదని తెలిపారు. శాంతియుతంగా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లే వారిని అడ్డుకోవడంలో అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై కారును పోనిచ్చిన నాయకుల్లో ఇప్పటిదాకా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం రాజకీయ దురుద్దేశమేనని ధ్వజమెత్తారు.

Read More : Lakhimpur : యూపీలో రైతుల ఆందోళన హింసాత్మకం..ఎనిమిది మంది మృతి

లఖింపూర్ ఖేరి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తోన్న కారును అడ్డుకుని, తమ నిరసన తెలియజేయడానికి రైతులు ప్రయత్నించారు. ఆయన ప్రయాణిస్తోన్న కారుకు అడ్డుగా కూర్చున్నారు. అయినప్పటికీ- లెక్క చేయలేదని, కారును రైతుల మీదుగా పోనిచ్చారనే ఆరోపణలు అజయ్ మిశ్రాపై ఉన్నాయి. ధర్నా చేస్తోన్న రైతులపై కారును పోనివ్వడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన తరువాత లఖింపూర్ ఖేరి ఒక్కసారిగా భగ్గుమంది.

Read More : Groom – Bride in JCB: జేసీబీలో ఊరేగుతూ.. పెళ్లికి విచ్చేసిన పెళ్లికొడుకు – పెళ్లికూతురు

తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు దాడులకు దిగారు. వాహనాలను ధ్వంసం చేశారు. కారుకు నిప్పు పెట్టారు. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరింపజేసింది. ప్రత్యేక టీమ్‌లను రప్పించింది. ఈ ఘటనను అత్యంత దురదృష్టకరమైనదిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు.. ప్రతిపక్షాలు ఖేరీ ఘటనపై భగ్గుమంటున్నాయ్‌.. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ నాయకులు రణ్‌దీప్‌ సుర్జేవాలా, కపిల్ సిబాల్ దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మర్‌ లీడర్ నరేశ్‌ తికాయత్ ఎమర్జెన్సీ మీటింగ్‌ కోసం పిలుపునిచ్చారు.