మోడీ కులం తెలియదు…అమేథీ ప్రజలకు ఆత్మగౌరవం ఉంది

  • Published By: venkaiahnaidu ,Published On : April 28, 2019 / 11:03 AM IST
మోడీ కులం తెలియదు…అమేథీ ప్రజలకు ఆత్మగౌరవం ఉంది

కేంద్రమంత్రి,అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అమేథీలో మీడియా సాక్షిగా స్మృతీ డబ్బులు,శారీలు,షూస్ పంచుతూ ఓటర్లను  ప్రలోభ పెడుతున్నారని ప్రియాంక విమర్శించారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-28,2019)కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతుగా అమేథీలో ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…అమేథీలో స్మృతీ ఇరానీ ప్రజలకు తప్పుడు హామీలిస్తూ కానుకలు ఎర చూపుతున్నారని విమర్శించారు.అమేథీ ప్రజలు ఎప్పుడూ ఎవరి ముందూ చేయి చాపరని, ఆ అవసరం వారికి లేదని అన్నారు. తాను 12 ఏళ్ల వయస్సు నుంచే అమేథీ,రాయబరేలీకి వస్తున్నానని,అమేథీ,రాయబరేలీ ప్రజలు చాలా ఆత్మగౌరవం కలిగిన వారన్నారు.దశాబ్దాలుగా గాంధీ కుటుంబ సభ్యుల పట్ల అమేథీ,రాయబరేలీ ప్రజలు చెక్కుచెదరని ప్రేమ, ఆప్యాయతలు కనబరుస్తున్నారని అన్నారు.

తన కులాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై బహరిచ్ లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ప్రియాంక స్పందించారు.ఈ రోజు వరకు మోడీ కులం ఏదో తనకు తెలియదన్నారు.ప్రతిపక్ష నాయకులు,కాంగ్రెస్ నాయకులు కేవలం అభివృద్ధికి సంబంధించిన అంశాలనే ప్రస్తావిస్తున్నారని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు.