ఫీజు పెంపు…ఉద్రిక్తంగా మారిన JNU విద్యార్థుల ఆందోళన

  • Published By: venkaiahnaidu ,Published On : November 11, 2019 / 07:22 AM IST
ఫీజు పెంపు…ఉద్రిక్తంగా మారిన JNU విద్యార్థుల ఆందోళన

ఢిల్లీ జేఎన్ యూ ఇటీవల హాస్టల్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఇవాళ(నవంబర్-11,2019)ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపు ఇష్యూపై చర్చించేందుకు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్ కుమార్ పలుమార్లు తిరస్కరించడంతో విద్యార్థులు ఇవాళ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE)వరకు మార్చ్ గా వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఏఐసీటీఈ కాన్వకేషన్ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయకడు ప్రసంగం కొనసాగుతున్న సమయంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. విద్యార్థులను ఏఐసీటీఈ కాన్వకేషన్ జరుగుతున్న ప్రదేశం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులుకు-విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. బ్యానర్లు చేతిలో పట్టుకుని,నినాదాలు చేస్తూ పోలీసులుగా అడ్డుగా పెట్టిన బారికేడ్లను దాటుకుంటూ వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. 

ఆందోళనకు ముందు విద్యార్థులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫీజు పెంపు భరించగల సామర్థ్యంతో సంబంధం లేకుండా సమానత్వం యొక్క కలను అణగదొక్కేస్తున్నారంటూ జవహర్ లాల్ నెహ్రూ విద్యార్థి సంఘం ఆ ప్రకటనలో తెలిపింది. ఫీజు పెంపు చాలామంది విద్యార్థులపై ప్రభావం చూపుతుందని తెలిపింది. డ్రెస్ కోడ్,కర్ఫ్యూ టైమింగ్స్ వంటి ఇతర నిబంధనలు తిరోగమన పరిస్థితులను ప్రతిబింబిస్తాయని విద్యార్థి సంఘం తెలిపింది.