ఎర్రకోటపై జెండా పాతిన అన్నదాతలు…. పోలీసులపై కత్తులు ఎత్తిన రైతులు

ఎర్రకోటపై జెండా పాతిన అన్నదాతలు…. పోలీసులపై కత్తులు ఎత్తిన రైతులు

దేశవ్యాప్తంగా కిసాన్ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. రిప‌బ్లిక్ డే సంధర్భంగా రైతుల కిసాన్ ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో.. సెంట్ర‌ల్ ఢిల్లీలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నించిన రైతుల‌ను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. లాఠీచార్జ్ చేయ‌డంతోపాటు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగిస్తూ రైతులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా కొంద‌రు నిహంగ్ ఆందోళ‌న‌కారులు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఖ‌డ్గాల‌ను పోలీసుల‌పై ఎత్తడం జరిగింది. అయితే గాయపరిచేంతలా సంయమనం మాత్రం కోల్పోలేదని అంటున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవజుతున్నాయి. ఢిల్లీ అక్ష‌ర్‌ధామ్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రగగా.. కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా.. రైతు నిరసనలతో దేశ రాజధాని అట్టుడికపొతోంది.

ఈ క్రమంలోనే రైతులు ఢిల్లీలోని ఎర్రకోటను ఎక్కి ఆందోళన చేస్తున్నారు. సిమెంట్‌ బారికేడ్లను రైతులు తమ చేతులతోనే పెకిలించి ముందుకు సాగుతున్నారు. ఎర్రకోటపై రైతు కవాతు సాగుతోంది. కొత్త చట్టాలను రద్దు చేస్తూ ప్రకటన వచ్చేవరకు వెనుదిరిగే ప్రసక్తే లేదంటూ ఎర్రకోటను చుట్టుముట్టారు రైతులు.

72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఎర్ర‌కోట‌పై రైతులు త‌మ జెండాను ఎగుర‌వేశారు.  వేలాది సంఖ్య‌లో సిక్కు రైతులు న‌గ‌రం న‌లువైపుల నుంచి  ఎర్ర కోట వైపుకు ర్యాలీగా వచ్చారు.  రాజ్‌ప‌థ్‌లో గ‌ణ‌తంత్ర వేడుక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే.. ట్రాక్ట‌ర్ల‌తో ర్యాలీ తీశారు.  న‌గరంలోకి దూసుకువ‌చ్చిన రైతుల‌ను ప‌లుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. ఎర్ర‌కోట ప్రాంగ‌ణానికి కూడా భారీ సంఖ్య‌లో రైతు ఆందోళ‌న‌కారులు వ‌చ్చారు.  అయితే కోట‌పైకి ఎక్కిన ఓ రైతు జెండాల‌ను పాతారు.