బాబ్రీ మసీదు కూల్చినందుకు గర్వపడుతున్నా…సాధ్వీకి ఈసీ నోటీసు

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2019 / 09:38 AM IST
బాబ్రీ మసీదు కూల్చినందుకు గర్వపడుతున్నా…సాధ్వీకి ఈసీ నోటీసు

భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి…తన శాపం వల్లనే ముంబై ఉగ్రదాడి (26/11)లో యాంట్రీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ చీఫ్ హేమంత్ కర్కరే‌ చనిపోయాడంటూ రెండు రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఈసీ నోటీసులందుకున్న ఆమె ఇప్పుడు… అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేతకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రెండోసారి ఈసీ నోటీసులందుకున్నారు.
ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సాధ్వి మాట్లాడుతూ…డిసెంబర్-6,1992న అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివారిలో నేను కూడా ఉన్నాను.దీనికి చాలా గర్వపడుతున్నాను. దేశం నుంచి మేము మరకను తొలగించాం.బాబ్రీ మసీదు పైకి ఎక్కి కూలగొట్టేశాం.దేవుడు ఈ అవకాశమిచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను.ఆ స్థలంలో తప్పకుండా రామాలయం నిర్మించి తీరుతాం అని అన్నారు.

ఆదివారం(ఏప్రిల్-21,2019)ఈసీ నోటీసులందుకున్న తర్వాత ఆమె మాట్లాడుతూ…అవును నేను అయోధ్యకు వెళ్లాను.నిన్న కూడా ఇదే చెప్పాను.నేనేమీ చెప్పలేదనటం లేదు.మసీదుని కూల్చినవారిలో నేను కూడా ఉన్నాను.అయోధ్యకు వెళ్లి రామమందిర నిర్మాణంలో నా వంతు సాయం చేస్తాను.ఇది చేయనీయకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు అని సాధ్వీ అన్నారు.