ప్రధాని మోడీపై ఆజాద్ ప్రశంసలు

ప్రధాని మోడీపై ఆజాద్ ప్రశంసలు

Ghulam Nabi Azad శనివారం జమ్మూలో నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్ లో గాంధీల నాయకత్వ విధానాన్ని ప్రశించిన జీ-23గా పిలువడే అసమ్మతి సీనియర్ కాంగెస్ నేతలతో కలిసి వేదిక పంచుకున్న కాంగ్రెస్ లీడర్ ఆజాద్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ..తన జీవితం గురించి ఎప్పుడూ దాచకపోవడం నిజంగా అభినందనీయమన్నారు.నరేంద్రమోడీ ఎప్పుడూ తన మూలాలు మర్చిపోలేదన్నారు.

జమ్మూలో ఆదివారం ఓ కార్యక్రమంలో గుజ్జర్ కమ్యూనిటీ సభ్యులనుద్దేశించి ఆజాద్ మాట్లాడుతూ..ప్రధాని మోడీ నుంచి ప్రజలు చాలా నేర్చుకోవాలి. ఆయన ప్రధాని అయినప్పటికీ తన మూలాలు మర్చిపోలేదు.ఆయన గర్వంగా తనని తాను ఛాయ్ వాలాగా చెప్పుకొంటారు. నాకు మోడీతో చాలా తీవ్రమైన రాజకీయ విబేధాలు ఉన్నప్పటికీ ప్రధాని ఒక ఒదిగి ఉండే వ్యక్తి. నేను చాలామంది నాయకుల నుంచి చాలా విషయాలు ఇష్టపడతాను. నేను గ్రామం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగాను, దానికి గర్వపడుతున్నాను.

మన ప్రధానమంత్రి కూడా గ్రామం నుంచి వచ్చారు,చిన్నతనంలో టీ అమ్మారు. మేము రాజకీయ ప్రత్యర్థులం. కానీ నేను మోడీని అభినందిస్తాను. ఎందుకంటే ఆయన తన నిజజీవితం గురించి దాచలేదు. కొంతమంది నాయకులు తమ గతాన్ని మరిచి బుడగలో(బబూల్)నివసిస్తున్నారని ఆజాద్ అన్నారు. తాను ప్రపంచమంతా పర్యటించానని, 5 స్టార్ హోటళ్లలో, 7 స్టార్ హోటళ్లలో బస చేశాననని.. కానీ తన గ్రామానికి చెందిన వ్యక్తులతో కూర్చున్నప్పుడు ఒక సువాసన ఉంటుందని,అది ప్రత్యేకమైనదని ఆజాద్ అన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నా గతాన్ని మర్చిపోకూడదన్నారు గులాంనబీ ఆజాద్. మన ప్రధాని లాంటి నేతలను చూసి తాను గర్వపడతానన్నారు.

కొద్దికాలంగా కాంగ్రెస్ పార్టీలోని లోపాలను ఎత్తిచూపిస్తోన్న ఆజాద్.. ఈ మధ్యే రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందారు. గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ సందర్భంగా ప్రధాని మోడీ ఆయనను రాజ్యసభలో ప్రశంసించారు మరియు ఆయనకు సంబంధించిన ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. తర్వాత గులాం నబీ ఆజాద్ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక, ఈ ప్రశంసల వెనుక మతలు ఏంటైనా ఉందా? అనే చర్చ సాగగా… కశ్మీర్‌లు మంచు ఎప్పుడు నల్లగా కురుస్తుందో అప్పుడు నేను బీజేపీలో చేరతానంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇక, గ్రూప్ -23 నాయకులలో ఒకరైన ఆజాద్.. ఇప్పుడు ప్రధానిపై ప్రశంసలు కురిపించడం చర్చగా మారింది. మరికొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్ బలహీనపడుతోందని తాము భయపడుతున్నామంటూ శనివారం జమ్మూ వేదికగా జీ-23 నేతలు వ్యాఖ్యానించిన మరుసటి రోజు ప్రధానిపై ఆజాద్ ప్రశంసలు కురిపించడం ఇప్పుడు ఆశక్తిగా మారింది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు శనివారం జమ్మూలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ అనే ఓ ప్రభుత్వేతర సంస్థ ఆధ్వర్యంలో గులాంనబీ ఆజాద్‌ ఏర్పాటు చేసిన “శాంతి సమ్మేళన్”కార్యక్రమానికి… జీ23 బృందంలోని కొందరు ముఖ్య సభ్యులు హాజరయ్యారు.ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, రాజ్‌ బబ్బర్‌,భూపిందర్ హుడా, మనీశ్ తివారీ, వివేక్ తన్ఖా.. ఆజాద్​తో పాటు ఉన్నారు. ఈ వేదికగా అసంతృప్తి నేతలందరూ అధిష్ఠానానికి గట్టి సందేశాన్ని పంపడం మాత్రమే కాకుండా కాంగ్రెస్ కొత్త జనరేషన్ కు సంబంధించి సలహాలను ఇచ్చారు.