Navjot Singh Sidhu : ప్రియాంకతో సిద్దూ భేటీ..బాదల్ మిసైల్ విమర్శలకు ఘాటు రిప్లై

పంజాబ్ కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు తీవ్ర‌మైన నేప‌థ్యంలో ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ మంత్రి న‌వ‌జోత్ సింగ్ సిద్దూ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీతో స‌మావేశ‌మ‌య్యారు.

Navjot Singh Sidhu : ప్రియాంకతో సిద్దూ భేటీ..బాదల్ మిసైల్ విమర్శలకు ఘాటు రిప్లై

Sidhu2

Navjot Singh Sidhu పంజాబ్ కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు తీవ్ర‌మైన నేప‌థ్యంలో ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ మంత్రి న‌వ‌జోత్ సింగ్ సిద్దూ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీతో స‌మావేశ‌మ‌య్యారు. త్వరలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై సుమారు నాలుగు గంటల పాటు ప్రియాంకతో సిద్దూ చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

కాగా, పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్- నవజోత్ సింగ్ సిద్దూ మధ్య కోల్డ్ వార్ తీవ్రమైంది. సీఎం విధానాలపై సిద్దూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో వ‌చ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ పార్టీని సంసిద్ధం చేసేందుకు, నేతల మ‌ధ్య విభేదాల‌కు స్వ‌స్తి ప‌లికేందుకు ప్రియాంక‌, రాహుల్ గ‌త కొద్ది వారాలుగా రాష్ట్ర నేత‌ల‌ను క‌లుస్తున్నారు. అమ‌రీంద‌ర్ సింగ్- సిద్ధూ మ‌ధ్య విభేదాల‌పైనా దృష్టి సారించిన హైకమాండ్.. పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురు సీనియర్ నేతలతో ఒక ప్యానల్ ను ఏర్పాటు చేసింది. ఇటీవలీ ఈ ప్యానల్ తో అమరీందర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. అయితే ప్యానల్ తో సిద్దూ సమావేశం కాకపోవడం చర్చనీయాంశమైన నేపథ్యంలో ప్రియాంకగాంధీతో తాను భేటీ అయిన ఫొటోను బుధవారం సిద్దూ ట్విట్టర్ లో షేర్ చేశారు. తమ చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయని తెలిపారు.

ఇక,బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా సిద్దూ కలిశారు. అయితే.. ఇటీవల 3 రోజులుగా దిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ను మాత్రం రాహుల్​ సహా పార్టీ అధిష్ఠానం కలవకపోవడం గమనార్హం.

మరోవైపు, సిద్దూపై శిరోమ‌ణి అకాలీద‌ళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాద‌ల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. సిద్ధూని ల‌క్ష్యం లేని మిసైల్‌గా బాద‌ల్ బుధ‌వారం అభివ‌ర్ణించారు. అదుపులో లేని క్షిప‌ణి వంటి వ్య‌క్తి సిద్ధూ అని అది త‌న‌తో స‌హా ఏ దిశ‌గానైనా వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్య‌క్తి పంజాబ్‌కు అవ‌స‌ర‌మ‌ని, న‌టించే నేత‌ల‌తో ఉప‌యోగం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌ బాద‌ల్ వ్యాఖ్య‌ల‌పై సిద్ధూ ఘాటుగా స్పందించారు. పంజాబ్ నుంచి అవినీతిని తుడిచిపెట్టేవర‌కూ తాను విశ్ర‌మించ‌న‌ని అన్నారు. బాద‌ల్ అవినీతి కార్య‌క‌లాపాల‌పై గురిపెట్టి పోరాడ‌తానని సిద్ధూ పేర్కొన్నారు.