రైల్వే ట్రాక్‌ల దిగ్భందంపై పంజాబ్ రైతు సంఘాల కీలక నిర్ణయం

  • Published By: madhu ,Published On : November 22, 2020 / 01:28 AM IST
రైల్వే ట్రాక్‌ల దిగ్భందంపై పంజాబ్ రైతు సంఘాల కీలక నిర్ణయం

Punjab Farmers : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 24 నుంచి ఆందోళనలు చేపడుతున్న పంజాబ్ రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాము చేపడుతున్న రైల్వే ట్రాక్ ల దిగ్భందంపై వెనక్కి తగ్గాయి. ఈ ఆందోళన విరమించేందుకు అంగీకారం తెలిపాయి. సీఎం అమరీందర్ తో శనివారం చర్చలు జరిగాయి.



అనంతరం రైతు సంఘాలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇందుకు గడువు విధించింది. 15 రోజుల పాటు రైల్వే ట్రాక్ ల దిగ్భందానికి విరామం ఇస్తున్నామని, కేంద్రం త్వరగా చర్చలకు వస్తే బాగుంటుందని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు. లేనిపక్షంలో తిరిగి నిరసనలు మొదలవుతాయని స్పష్టం చేశారు.



రైతు సంఘాలతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, నవంబర్ 23వ తేదీ రాత్రి నుంచి రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయని సీఎం అమరీందర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పంజాబ్ కు రైలు సేవలను పునరుద్ధరించాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతానన్నారు. ఈ చర్య ఆర్థిక వ్యస్థను సాధారణ స్థితికి తెస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.



నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపడుతున్నారు. రైల్వే ట్రాక్ లపై నిరసన చేపడుతుండడంతో రైల్వే శాఖ పంజాబ్ కు సేవలను నిలిపివేసింది. దీంతో రాష్ట్రానికి గూడ్స్ రైళ్లు రాకపోకలు నిలిచిపోయింది. దీనిపై ఆధారపడిన బొగ్గు, నిత్యావసరాలు, వ్యవసాయానికి ఎరువులు తదితర వస్తువుల కొరత ఏర్పడింది. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంజాబ్ లో నిరసనల కారణంగా..రూ. 2 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు రైల్వే శాఖ వెల్లడిస్తోంది.