రైతులను జైలుకి పంపే నిబంధన పంజాబ్ వ్యవసాయ చట్టంలోనే ఉంది

రైతులను జైలుకి పంపే నిబంధన పంజాబ్ వ్యవసాయ చట్టంలోనే ఉంది

Punjab నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి. పార్లమెంట్‌లో విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు విదేశీ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తోమర్ తెలిపారు.

శుక్రవారం రాజ్యసభలో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ..సాగు చట్టాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. అంతమాత్రాన అందులో లోపాలు ఉన్నట్లు భావించకూడదన్నారు. విపక్షాలు వ్యవసాయ చట్టాలను నల్లచట్టాలుగా పేర్కొంటున్నాయని.. అందులో నలుపు ఏముందని తాను అడుగుతున్నానని.. వాళ్లు చెబితే తాము సరిచేస్తామన్నారు. చట్టాల్లో ఎక్కడా పొరపాట్లు లేవు.. కానీ రైతుల ఆందోళనల్లోనే పొరపాట్లు కనిపిస్తున్నాయన్నారు.

రైతుల భూములపై కార్పొరేట్లకు అధికారం కల్పించేలా ఈ చట్టాలు ఉన్నాయని విపక్షాలు చేస్తోన్న ఆరోపణలను తాను ఖండిస్తున్నానన్నారు. కావాలనే కొందరు రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి చెందిన రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. ఒప్పంద వ్యవసాయ చట్టం ద్వారా రైతుల భూములు దోపిడీకి గురవుతాయని చెప్పేలా ఒక్క నిబంధన అయినా చట్టంలో ఉందా? చూపించండి అని తోమర్ ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని తోమర్ సృష్టం చేశారు.

ఏపీఎంసీ( Agricultural Produce Market Committee) వెలుపల ఉన్న ప్రాంతాన్ని వాణిజ్య ప్రాంతం అని పిలుస్తాం, అది రైతు ఇల్లు, పొలం లేదా ఏదైనా కావచ్చు అనే నిబంధనను తాము చట్టంలో చేర్చామన్నారు. తాము తీసుకొచ్చిన చట్టం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఎపిఎంసి వెలుపల విక్రయించడానికి అనుమతిస్తుంది. అలాగే,రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా APMC బయట చేసే వ్యాపారంపై ఎలాంటి పన్ను ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుత ఏపీఎంసీలో రాష్ట్ర పన్ను కోసం ఓ నిబంధన ఉందన్నారు. ఏపీఎంసీ బయట ఎలాంటి ట్యాక్స్ లేదని..కేంద్ర చట్టం ట్యాక్స్ ని రద్దు చేసిందన్నారు.

ఇక ,పంజాబ్ ప్రభుత్వపు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టంలో రైతులను జైలుకి పంపించే ఓ నిబంధన ఉందని తోమర్ అన్నారు. అయితే ఆ నిబంధనల కేంద్ర చట్టంలో లేదన్నారు. భారత ప్రభుత్వ చట్టం ప్రకారం.. ఓ రైతు కాంట్రాక్ట్ నుంచి ఎప్పుడైనా వైదొలగచ్చన్నారు. పంజాబ్ చట్టంలో రైతులకు 5లక్షల ఫైన్ విషయం గురించి కూడా ఉందన్నారు.

మరోవైపు, రిపబ్లిక్ డే రోజున చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో రైతు సంఘాలు శనివారం(ఫిబ్రవరి-6,2021)చేపట్టనున్న’చక్కా జామ్’పై అందరి దృష్టి నెలకొంది.’చక్కా జామ్​’ పేరుతో నిర్వహించే దేశవ్యాప్త రహదారుల దిగ్బంధం కార్యక్రమం కోసం రైతులు సిద్ధమవుతుండగా.. పరిస్థితులు అదుపుతప్పకుండా చూసేందుకు భద్రతా దళాలు ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశాయి.