సెప్టెంబర్​ 10న అధికారికంగా వాయుసేనలోకి “రఫేల్”

  • Published By: venkaiahnaidu ,Published On : August 28, 2020 / 06:16 PM IST
సెప్టెంబర్​ 10న అధికారికంగా వాయుసేనలోకి “రఫేల్”

గత నెలలో ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ 10 అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హరియాణాలోని అంబాలాలోని ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్స్ ను అధికారికంగా ఐఏఎఫ్ కు అప్పగించనున్నారు. రాఫెల్ విమానాలను ఐఏఎఫ్ కు అప్పగించే వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు

అంబాలాలో జరిగే ఈవెంట్ లో రాజ్ నాథ్ సింగ్ తో పాటుగా త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ సహా ఉన్నతస్థాయి సైన్యాధికారులు మరియు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్టీ కూడా పాల్గొననున్నారు. పార్లీ భారత్​ పర్యటన అవకాశాలపై ఇరు దేశాల అధికారులు పలు దఫాలు చర్చించిన తర్వాతే సెప్టెంబర్​ 10న ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.

2016లో 36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రూ. 58వేల కోట్లతో భారత ప్రభుత్వం.. ప్రాన్స్ కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలిదశలో భాగంగా ఈ ఏడాది జులై 29న అంబాలా వైమానిక స్థావరానికి 5 రఫేల్​ యుద్ధ విమానాలు చేరుకున్నాయి. రఫేల్ జెట్స్​ తొలి స్వ్కాడ్రన్​ను అంబాలా వైమానిక స్థావరంలో, రెండో స్వ్కాడ్రన్​ను బంగాల్​లోని హసిమారా స్థావరంలో ఏర్పాటు చేయనున్నారు. కాగా, రెండో దశలో మరో నాలుగు విమానాలు వచ్చే అక్టోబర్​లో భారత్​కు చేరనున్నాయని వైమానిక వర్గాలు తెలిపాయి.

గగనతంలో వేగంగా ప్రయాణిస్తూ, భూమ్మీదున్న టార్గెట్లను కచ్చితంగా ఛేదించడం, ఎయిర్ టు ఎయిర్ ఫైట్ లోనూ దీటుగా వ్యవహరించడం, దీర్ఘ శ్రేణి రాకెట్లను కూడా మోసుకెళ్లే సామర్థ్యం తదితర ప్రత్యేకతలు రాఫెల్ సొంతం. చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు ఎంతకీ తగ్గకపోవడం, ఎల్ఏసీ వెంబడి చైనా యుద్ధ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ లోకి రాఫెల్ విమానాలు చేరుతుండటం భారత వాయుసేనకు మరింత బలం చేకూర్చినట్లవుతుందని డిఫెన్స్ నిపుణులు తెలిపారు.