భారత్ కు మరో 4 ‘రాఫెల్’ యుద్ధవిమానాలు..నవంబర్ ఫస్ట్ వీక్ లో ల్యాండింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : October 16, 2020 / 06:16 PM IST
భారత్ కు మరో 4 ‘రాఫెల్’ యుద్ధవిమానాలు..నవంబర్ ఫస్ట్ వీక్ లో ల్యాండింగ్

rafale-fighter-jets-to-join-indian-air-force-

SECOND BATCH RAFEL JETS ఈ ఏడాది జులైలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్-10న ఈ ఐదు యుద్ధ విమానాలు అధికారికంగా వాయుసేనలో చేరాయి. మొదటి విడతలో చేరుకున్న 5 రఫెల్ విమానాల్లో…రెండు సీట్లు క‌లిగిన శిక్ష‌ణ విమానాలు కాగా, మ‌రో మూడు ఒకే సీటు క‌లిగిన యుద్ధ విమా‌నాలు.

అయితే, ఇప్పుడు రెండో బ్యాచ్‌ లో భాగంగా 3-4 రాఫెల్‌ యుద్ధ విమానాలు నవంబర్‌లో భారత్‌ కు చేరనున్నాయి. ఈ మేరకు భారత వాయుసేన (IAF) యుద్ధ విమానాల రవాణా, పైలట్లకు శిక్షణ కోసం ఒక బృందాన్ని ఫ్రాన్స్‌ (France) కు పంపింది. నవంబర్ మొదటివారంలోనే 3-4రాఫెల్ విమానాలు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకోబోతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మరికొద్దిరోజుల్లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 8-9 రాఫెల్ యుద్ధవిమనాలు భాగమవనున్నయని వారు తెలిపారు.



మరోవైపు, ఇప్పటికే భారత్..అత్యధునిక యుద్ధ విమానాలు రాఫెల్స్‌ను కూడా రక్షణ కోసం సరిహద్దులోకి మోహరించింది. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌ ఏమాత్రం వక్రబుద్ధి చూపించినా.. తగిన బుద్ధి చెప్పేందుకు, వారి ఆట కట్టించేందుకు భారత ఆర్మీ, భారత వాయుసేన ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాఫెల్స్‌ రెండో బ్యాచ్‌ భారత్‌కు చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రాఫెల్స్ కోసం అంబాలా ఎయిర్‌ బేస్‌లో ’17 గోల్డెన్ ఆరోస్’ అనే పేరుతో కొత్త ఎయిర్‌ స్క్వాడ్రన్‌ను సైతం అధికారులు ఏర్పాటు చేశారు.



గగనతంలో వేగంగా ప్రయాణిస్తూ, భూమ్మీదున్న టార్గెట్లను కచ్చితంగా ఛేదించడం, ఎయిర్ టు ఎయిర్ ఫైట్ లోనూ దీటుగా వ్యవహరించడం, దీర్ఘ శ్రేణి రాకెట్లను కూడా మోసుకెళ్లే సామర్థ్యం తదితర ప్రత్యేకతలు రాఫెల్ సొంతం.



ఆత్యాధునిక 36 రాఫెల్స్‌ను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్-‌ఫ్రాన్స్‌ మధ్య 2016లో ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. 2023 నాటికి ఐఏఎఫ్‌లో మొత్తం 36 రాఫెల్స్‌ చేరుతాయని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో 18ని అంబాలా ఎయిర్‌బేస్‌లో, మరో 18ని భూటాన్ సరిహద్దులోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు.