అదనపు బలం : భారత వాయుసేనలో మరో మూడు Rafale యుద్ధ విమానాలు

  • Published By: madhu ,Published On : November 2, 2020 / 01:50 PM IST
అదనపు బలం : భారత వాయుసేనలో మరో మూడు Rafale యుద్ధ విమానాలు

Rafale jets to fly non-stop from France to India : భారత వైమానిక దళానికి మరో అదనపు బలం చేకురనుంది. మరో రెండు రోజుల్లో 3 రాఫెల్ యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదలో వచ్చి చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు నవంబర్ 4న భారత్‌కు వస్తున్నాయి. ఇవి ఫ్రాన్స్ నుంచి నేరుగా అంబాలా విమానాశ్రయానికి చేరుకుంటాయి.



సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌ ఏమాత్రం వక్రబుద్ధి చూపించినా.. తగిన బుద్ధి చెప్పేందుకు.. వారి ఆట కట్టించేందుకు భారత ఆర్మీ, వాయుసేన ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. తూర్పు లద్ధాఖ్‌ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో రాఫెల్స్‌ రెండో బ్యాచ్‌ భారత్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.



భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా ఉన్న మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు జూలై 29న వచ్చాయి. రాఫెల్స్ కోసం అంబాలా ఎయిర్‌ బేస్‌లో గోల్డెన్‌ యారోస్‌ అనే పేరుతో కొత్త ఎయిర్‌ స్క్వాడ్రన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రాఫెల్స్‌ను సెప్టెంబరు 10న అధికారికంగా భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు.



ఇప్పటికే వీటిని లద్ధాఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు. లద్ధాఖ్ గగనతలంలో చైనా సైనిక కార్యకలాపాలపై రాఫెల్స్‌ కన్నేసి ఉంచాయి. ఇలాంటి సమయంలో రాఫెల్‌ రెండో బ్యాచ్‌ భారత్‌కు చేరనుండడంతో చైనాకు వణుకు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు రాబోతున్న మూడు రాఫెల్స్‌..ఇప్పటికే వచ్చిన ఐదు రాఫెల్స్‌తో కలిపి ఇండియా దగ్గర మొత్తం 8 రాఫెల్స్ ఉండనున్నాయి. 2021 ఏప్రిల్‌ నాటికి మరో 16 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు రానున్నాయి.