Congress party: అధ్యక్షుడిగా రాహుల్ వద్దు.. కాంగ్రెస్‌లో చర్చనియాంశంగా పీకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం...

Congress party: అధ్యక్షుడిగా రాహుల్ వద్దు.. కాంగ్రెస్‌లో చర్చనియాంశంగా పీకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Prasanth Kishor

Congress party: దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా జతకట్టేందుకు సిద్ధం కావడంతో దేశవ్యాప్తంగా బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు ఒకే గొడుకు కిందకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నాలుగు దఫాలుగా సోనియా, రాహుల్, కాంగ్రెస్ పెద్దలతో ప్రశాంత్ భేటీ అయ్యారు. అయితే బుధవారం సోనియా, కాంగ్రెస్ పెద్దలతో ప్రశాంత్ కిషోర్ సుమారు 6గంటల పాటు భేటీ అయ్యారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లే టార్గెట్‌గా దేశంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏఏ పార్టీలతో చేతులు కలపాలనే విషయాలపై 85 పేజీల పీకే పవర్ పాయింట్ బహిర్గతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

Sonia – Prasanth kishore: మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయిన సోనియా – ప్రశాంత్ కిషోర్

ఎన్నికల వ్యూహకర్త ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం ఎలా ఉండాలనే దానిపై స్పష్టంగా సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వ సమస్య పరిష్కారానికి పీకే రెండు నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ, పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రా, వర్కింగ్ లేదా వైస్ ప్రెసిడెంట్‌గా గాంధీయేతర వ్యక్తి, యుపిఎ చైర్‌పర్సన్‌గా “పూర్వపు” కాంగ్రెస్ నాయకుడు కొనసాగిస్తే బాగుంటుందని ప్రశాంత్ కిషోర్ సూచనగా తెలుస్తోంది.

Sonia – Prasanth kishore: మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయిన సోనియా – ప్రశాంత్ కిషోర్

మరో విధానంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీయేతర వ్యక్తి, యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా, పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్, ప్రధాన కార్యదర్శి సమన్వయకర్తగా ప్రియాంక ప్రశాంత్ తన ప్రజెంటేషన్‌లో సూచించారు. పార్లమెంటరీ పార్టీ అధినేతగా రాహుల్‌ పార్లమెంట్‌లోనూ, బయటా ప్రజల గొంతును సమర్థంగా వినిపించగలరని, మోదీకి వ్యతిరేకంగా ఆయనను నిలదీయగలరని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఇప్పటికే ఆ వాదన కాంగ్రెస్ పక్ష పార్టీల నుంచి వ్యక్తమవుతున్నట్లు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. పార్లమెంటరీ బోర్డు పునరుద్ధరణ G-23 నాయకుల కీలక డిమాండ్లలో ఇదికూడా ఒకటి. యుపిఎ చైర్‌పర్సన్‌గా కాంగ్రెసేతర నాయకుడిని పిలవాలని శివసేనతో సహా కొన్ని ప్రతిపక్షాలు పదేపదే పిలుపునివ్వడం, ప్రశాంత్ ప్రజెంటేషన్ ఇదే ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.

Prasanth Kishore : కాంగ్రెస్‌కు అది దేవుడిచ్చిన హక్కు కాదు.. రాహుల్‌ని టార్గెట్ చేసిన పీకే

ఇక దేశవ్యాప్తంగా పొత్తుల విషయానికి వస్తే ప్రశాంత్ కిషోర్ తన ప్రజెంటేషన్‌లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా వెళితే బీజేపీని ఢీకొనడం కష్టమని, మహారాష్ట్రలో ఎన్‌సిపి, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డిఎంకె, జార్ఖండ్‌లోని జేఎంఎంతో పొత్తులను ఏర్పర్చుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసినట్లు కనిపిస్తుంది. అయితే తెలంగాణ‌లో మాత్రం ఒంటరిగా వెళ్లాలని పీకే సూచించడం గమనార్హం. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యం తక్కువగా ఉందని, యువతను ప్రోత్సహించి పార్టీ పదవులు అప్పగిస్తే పార్టీని బలోపేతం చేసేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని పీకే తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పీకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కాంగ్రెస్ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి పీకే ప్లాన్ ను కాంగ్రెస్ అధినాయకత్వం ఏ మేరకు అమలు చేస్తుందో వేచి చూడాల్సిందే.