ట్రాక్టర్ నడిపిన రాహుల్..దేశ వినాశకారిగా మారుతున్నాడన్న నిర్మలా సీతారామన్

ట్రాక్టర్ నడిపిన రాహుల్..దేశ వినాశకారిగా మారుతున్నాడన్న నిర్మలా సీతారామన్

Rahul Gandhi రాజస్థాన్​ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్​ గాంధీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రూపన్​గఢ్​లో రైతుల ర్యాలీ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో రైతులకు మద్దతుగా కొద్దిసేపు ట్రాక్టర్​ నడిపారు. రాహల్​.. ట్రాక్టర్​ నడపగా.. ఆయన పక్కన రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్​ సింగ్​ దోస్త్రా కూర్చున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్​ మాకెన్​, సచిన్​ పైలట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రూపాన్​గఢ్​లో రైతులతో​ సమావేశమైన రాహుల్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ఇద్దరు స్నేహితులకు మొత్తం దేశ వ్యవసాయరంగాన్ని అప్పగించాలనుకుంటున్నారని ఆరోపించారు. సాగు చట్టాల వల్ల నిరుద్యోగం పెరుగుతుందని రాహుల్ ఆరోపించారు. వ్యవసాయ రంగం అంటే.. రైతులు, చిన్న మధ్యతరహా వ్యాపారులు, కూలీలు, వంటి 40 శాతం మంది వ్యాపారం. ఈ మొత్తం వ్యాపారాన్ని నరేంద్ర మోడీ తన ఇద్దరు స్నేహితులకు అప్పగించాలని చూస్తున్నారు. అందుకే నూతన సాగు చట్టాలను తీసుకువచ్చారు. ప్రజలకు మోడీ కొన్ని ఆప్షన్లు ఇచ్చారు.. అవి ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు అని రాహుల్ విమర్శించారు. వ్యవసాయం భరతమాతకు చెందినదని, పారిశ్రామికవేత్తలకు కాదని వ్యాఖ్యానించారు. ఇక అంతకుముందు అంత‌కుముందు అజ్మీర్‌లోని వీర్ తేజాజీ మ‌హ‌రాజ్ ఆల‌యాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు రాహుల్.

మరోవైపు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. శనివారం లోక్​సభలో రాహుల్​ గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విధివిధానాలను అవమానిస్తూ, అవాస్తవ ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ​ దేశ వినాశకారిగా మారతున్నారని వ్యాఖ్యానించారు. అనవసర ఆరోపణలు చేసే రాహుల్​కు బడ్జెట్​​పై కేంద్ర వివరణ వినే సహనం కూడా లేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్​పై రాహుల్​ గాంధీ గురువారం చేసిన వ్యాఖ్యలకు బదులుగా నిర్మల ఈ విధంగా స్పందించారు. వ్యవసాయ చట్టాలపైన మాట్లాడిన రాహుల్​.. పంజాబ్​లో రైతుల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదని నిర్మల ప్రశ్నించారు.

రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో కాంగ్రెస్​ తన హయాంలో రుణమాఫీలు ఎందుకు చేయలేదో రాహుల్​ వివరించాలన్నారు. గురువారం చేసిన ప్రసంగంలో సాగు చట్టాలలోని ఒక్క క్లాజ్​ గురించి కూడా ప్రసావించలేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలో సంస్కరణలను సమర్థించిన మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆమె పేర్కొన్నారు. ​సాగు చట్టాలను ప్రతిపాదించిన కాంగ్రెసే ఇప్పుడు ఎందుకు యూటర్న్​ తీసుకుందో అన్న విషయం తనకు తెలుకోవాలని ఉందని… కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదని నిర్మలా తెలిపారు.