6 రోజుల క్రితమే ఇటలీ నుంచి వచ్చిన రాహుల్ కరోనా టెస్ట్ లు చేయించుకున్నారా?ఈశాన్య ఢిల్లీలో పర్యటిస్తున్న రాహుల్….

  • Published By: venkaiahnaidu ,Published On : March 4, 2020 / 12:26 PM IST
6 రోజుల క్రితమే ఇటలీ నుంచి వచ్చిన రాహుల్ కరోనా టెస్ట్ లు చేయించుకున్నారా?ఈశాన్య ఢిల్లీలో పర్యటిస్తున్న రాహుల్….

ఈశాన్య ఢిల్లీలో గత వారం 4రోజుల పాటు సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. 200మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటికే అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ సహా పలు రాజకీయ పార్టీలు పర్యటించాయి. అయితే ఇప్పుడు అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పర్యటన ప్రారంభించింది.

బాధితులకు సంఘీభావం తెలిపేందుకు బుధవారం(మార్చి-4,2020)మధ్యాహ్నాం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు ఈశాన్య ఢిల్లీలో పర్యటన ప్రారంభించారు. రాహుల్ తో పాటు లోక్ సభ కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, ఏఐసీసీ సభ్యుడు కేసీ వేణుగోపాల్, అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తదితర సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఘర్షణకు మూలకారణమైన ప్రాంతం బ్రిజ్ పురి ఏరియాకు రాహుల్ బృందం వెళ్లింది. పలువురు స్థానికులతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు.

బ్రిజ్ పురి ఏరియాలో ధ్వంసమైన ఓ స్కూల్ ని రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఈ పాఠశాల ఢిల్లీ భవిష్యత్తు. ద్వేషం మరియు హింస దానిని నాశనం చేసింది. ఈ హింస భారత్ మాతకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ సమయంలో అందరూ కలిసి పనిచేయాలి మరియు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.

అయితే రాహుల్ ఈశాన్య ఢిల్లీ విజిట్ పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేవలం ఆరు రోజుల క్రితమే రాహుల్ గాంధీ ఇటలీ నుంచి వచ్చారని, ఎయిర్ పోర్ట్ లో స్క్రీనింగ్ టెస్ట్ రాహుల్ కి జరిగిందా అన్నది ఆయన చెప్పాలని బీజేపీ ఎంపీ రమేష్ బిదురి ప్రశ్నించారు. రాహుల్ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడా లేక కరోనా వైరస్ వ్యాప్తి చేయాలనుకుంటున్నాడా అని రమేష్ ప్రశ్నించారు.