ఇంత స్పీడా : తిరుమల కొండ ఎక్కడంలో రాహుల్ రికార్డ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 22, 2019 / 10:42 AM IST
ఇంత స్పీడా : తిరుమల కొండ ఎక్కడంలో రాహుల్ రికార్డ్

తిరుమల పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. కేవలం ఒక గంట 50 నిమిషాల్లోనే కాలినడకన తిరుమల చేరుకున్నారు రాహుల్. ఇంత తక్కువ సమయంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న మొదటి పొలిటీషియన్ గా రికార్డ్ సృష్టించారు. అలిపిరిలో ఉదయం 11:40 గంటల సమయంలో నడక ప్రారంభించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కొండపైకి చేరుకున్నారు. మేనల్లుడు రేహాన్‌ వాద్రాతో కలసి పోటీ పడుతూ నడిచారు. నడక మార్గంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు. కనీసం కూర్చోను కూడా లేదు. 3వేల 500లకు పైగా ఉన్న మెట్లను చకచకా ఎక్కేశారు. గాలిగోపురం దగ్గర సాధారణ భక్తుడిలా దివ్యదర్శనం టోకెన్ పొందారు. కాలినడకన తిరుమలకు వెళ్తున్న సమయంలో దారిపొడవునా రాహుల్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఆయనతో కలిసి సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు.

తిరుమల చేరుకున్న తర్వాత అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ సాంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం 2014 ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్రమోడీ సభ నిర్వహించిన తారకరామ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. కనీసం మూడు గంటలు అయినా పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఎవరూ ఊహించని విధంగా జస్ట్ ఒక గంటా 50 నిమిషాల్లోనే అలిపిరి మార్గంలో ఓ పొలిటీషియన్ కొండ ఎక్కటం విశేషంగా చెప్పుకుంటున్నారు.