పారికర్ ను కలిసిన రాహుల్ : రాఫెల్ గురించి మాట్లాడలేదు

గోవా: గోవా పర్యటనలో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సీఎం మనోహర్ పారికర్ ను పరామర్శించారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న పారికర్ ను శాసనసభలో కలిసిన రాహుల్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 5 నిమిషాలపాటు పారికర్ ను పరామర్శించిన అనంతరం రాహుల్ శాసన సభలో ప్రతిపక్ష లాబిలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. వ్యక్తిగతంగా పారికర్ ను కలుసుకున్నానని, పారికర్ త్వరగా కోలుకోవాలని రాహుల్ ట్వీట్ చేశారు.రాఫెల్ డీల్ విషయంలో సోమవారం పారికర్ను తీవ్రంగా విమర్శించిన రాహుల్ మంగళవారం ఆయనతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
రాఫెల్ పై గోవా ఆడియో టేప్ లు బయటకొచ్చి 30 రోజులవుతున్నా ఇంకా ఎఫ్ఐఆర్, విచారణ కానీ ఎందుకు జరుగలేదని రాహుల్ సోమవారం ట్వీట్ చేశారు. రాఫెల్ విషయం పారికర్ కు తెలుసని అందుకు సంబంధించిన ఫైల్ ఆయన దగ్గర ఉండటం వల్లనే ఆయన ఇంకా గోవా సీఎంగా కొనసాగుతున్నారని ఆట్వీట్ లో రాహుల్ ఆరోపించారు. పారికర్ తో భేటీ తరువాత మీడియాతో మాట్లాడని రాహుల్… ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మాత్రమే కలిసినట్లు ట్వీట్ చేశారు.