18న దేశవ్యాప్తంగా రైల్ రోకో..రైతు సంఘాల పిలుపు

18న దేశవ్యాప్తంగా రైల్ రోకో..రైతు సంఘాల పిలుపు

‘Rail Roko’ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఇటీవల దేశవ్యాప్త రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో కార్యక్రమానికి రైతు నేతలు పిలుపునిచ్చారు.

ఈ నెల 18న రైల్​ రోకోలో భాగంగా నాలుగు గంటల పాటు(మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4వరకు)దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే, ఈ నెల 12 నుంచి రాజస్థాన్‌లోని అన్ని టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ కలెక్షన్‌ను కొనసాగనీయబోమని తెలిపింది. ఇక ,పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళిగా ఈ నెల 14న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు.

మరోవైపు, ప్రభుత్వంతో తాము మరోసారి చర్చలకు సిద్దమే అని ఇప్పటికే రైతు సంఘాలు ప్రకటించాయి. కేంద్రమే చర్చలకు తేదీని ఖరారు చేయాలని రైతు నేతలు తెలిపారు. కేంద్రం.. రైతులను చర్చలకు పిలవాలని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​ అన్నారు. తమ కమిటీ చర్చలకు సిద్ధంగానే ఉందని.. కేవలం దీనితోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో అధికార మార్పిడి జరగాలని తాము కోరుకోవడం లేదని.. కేవలం వివాదాస్పద సాగు చట్టాల రద్దు కోసమే ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు.