Raj Kundra Case:వీడియో- జైలు నుండి విడుదలైన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పా శెట్టి భర్త మరియు వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆర్థర్ రోడ్ జైలు నుండి విడుదలయ్యారు.

10TV Telugu News

Raj Kundra Case:అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పా శెట్టి భర్త మరియు వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆర్థర్ రోడ్ జైలు నుండి విడుదలయ్యారు. ముంబై కోర్టు అతనికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల పూచీకత్తుపై రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అశ్లీల వీడియోలు చేసినందుకు రాజ్ కుంద్రా జూలై 19 నుండి జైలులో ఉన్నారు. తన భర్త అరెస్ట్ తర్వాత కష్టాలను ఎదుర్కొంటున్న భార్య, నటి శిల్పా శెట్టి, తన భర్త విడుదల తర్వాత ఊపిరి పీల్చుకుంది.

ఈమేరకు శిల్పా ఓ కథనాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 20 న రాజ్‌కు బెయిల్ మంజూరైన కొద్దిసేపటికే, శిల్పా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేసింది, తుఫాను వచ్చిన తర్వాత కూడా అందమైన విషయాలు జరగవచ్చని రుజువు చేయడానికి రెయిన్‌బో వచ్చింది అని రాసుకొచ్చింది. సెప్టెంబర్ 18 న, రాజ్ కుంద్రా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. అందులో రాజ్‌కుంద్రాను ‘బలిపశువు’ చేసినట్లు పేర్కొన్నారు.

అంతకుముందు పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాపై 1400 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు ముంబై పోలీసులు. బ్రిటన్ సిటిజన్ గా ఉన్న రాజ్ కుంద్రా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందంటూ పోలీసులు భావించగా.. అప్పుడు ఎన్నోసార్లు కుంద్రా బెయిల్ నిరాకరించబడింది. ఈ క్రమంలోనే కుంద్రా పాస్ పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన రెండు నెలల తర్వాత బెయిల్‌ రావడంతో కుంద్రా బయటకు వచ్చారు.