ఆదిత్యకు పోటీగా అమిత్…మహారాష్ట్రలో షాడో కేబినెట్ ప్రకటించిన రాజ్ ఠాక్రే

  • Published By: venkaiahnaidu ,Published On : March 9, 2020 / 12:15 PM IST
ఆదిత్యకు పోటీగా అమిత్…మహారాష్ట్రలో షాడో కేబినెట్ ప్రకటించిన రాజ్ ఠాక్రే

మహారాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అన్నీ ప్రయత్నాలను చేస్తున్నారు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(MNS)అధినేత రాజ్ ఠాక్రే. రాబోయే కాలంలో మహా రాజీకీయాలను శాసించాలని భావిస్తున్న ఆయన ఇటీవల తన పార్టీ జెండాను కూడా మార్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తో శివసేన కలవడంతో హిందుత్వాన్ని భుజాన మోస్తున్న ఎమ్ఎన్ఎన్ పార్టీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

సోమవారం(మార్చి-9,2020)ఎమ్ఎన్ఎస్ పార్టీ 14వ ఫౌండేషన్ డే సందర్భంగా  సీఎం ఉద్దవ్ ఠాక్రే కేబినెట్ కు పోటీగా ‘షాడో కేబినెట్’ ప్రకటించారు రాజ్ ఠాక్రే. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పర్యాటక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆదిత్యకు పోటీగా రాజ్‌ థాకరే తన కుమారుడు అమిత్ థాకరేకు కూడా పర్యాటక శాఖను కేటాయించడంతో పాటు న్యాయ శాఖను కూడా కేటాయించారు. ఈ షాడో కేబినెట్‌ను ప్రకటించడంతో రాజకీయంగా ఉద్ధవ్‌తో యుద్ధానికి దిగడమే అని కొందరు స్పష్టం చేస్తున్నారు.

ఈ షాడో కేబినెట్ అనే కూర్పు బ్రిటీష్ రాజకీయాల్లో ఉంది. ప్రభుత్వాలు ఏవైనా తప్పులు ఉంటే ఈ షాడో కేబినెట్ ఎత్తిచూపి, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంది. శివసేన వ్యవస్థాపకులు బాల్‌థాకరే తన వారసుడిగా ఉద్ధవ్ ను ప్రకటించిన సందర్భంలో రాజ్ థాకరే విభేదించి 2006 లో మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అనే సొంత కుంపటిని పెట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి శివసేనకు, ఎం.ఎన్.ఎస్‌కు మధ్య రాజకీయంగా వైరుధ్యమేర్పడింది.

కొంతకలం పాటు మహా రాజకీయాల్లో ఎమ్ఎన్ఎస్ పార్టీ కొద్దిగా ప్రభావం చూపించినా ఆ తర్వాత కాలంలో పూర్తిగా వెనుకబడిపోయింది. ఇప్పుడు ఎమ్ఎన్ఎస్ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా అర్థమవుతోంది. ఇటీవల బీజేపీ నాయకుడు,మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్ ఠాక్రేను కలవడం దీనికే సంకేతమని మహా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.