ఆక్సిజన్ ఉత్పత్తి ఫ్లాంట్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన రాజస్తాన్

ఆక్సిజన్ ఉత్పత్తి ఫ్లాంట్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన రాజస్తాన్

Rajasthan Govt

Rajasthan govt కరోనా విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. కరోనా రోగుల చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్ సరిపడా అందుబాటులో లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను నివారించే ఉద్దేశంతో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిచేసే ప్లాంట్లు ఏర్పాటు చేసే వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వనున్నట్టు రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గురువారం ప్రకటించారు. అవసరమైన రాయితీలు, సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని అందుకోవాలంటే కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే, సెప్టెంబర్-30,2021 నాటికి ఆ ప్లాంట్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. దీనికి ముందుకొచ్చే వారికి MSME చట్టం-2019 ప్రకారం మూడేళ్లపాటు రెగ్యులారిటీ అప్రూవల్స్, ఇన్‌స్పెక్షన్స్ నుంచి మూడేళ్లపాటు మినహాయింపు లభిస్తుంది.

అలాగే, ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వమే చొరవతీసుకుని ఇప్పిస్తుంది. నీరు, విద్యుత్ కనెక్షన్ వంటి వాటిని తక్షణమే ఇప్పిస్తుంది. అదేవిధంగా.. ప్లాంట్, యంత్రసామగ్రి, ఇతర పరికరాల వ్యయంపై 25 శాతం (గరిష్టంగా రూ. 50 లక్షలు) రెండు విడతలుగా మూలధనం కింద మంజూరు చేస్తుంది.