వీడియో.. పోలీస్ డ్రెస్‌లో ప్రీ వెడ్డింగ్ : అధికారుల నోటీసులు

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 09:20 AM IST
వీడియో.. పోలీస్ డ్రెస్‌లో ప్రీ వెడ్డింగ్ : అధికారుల నోటీసులు

ఈ కాలంలో ఎవరికైనా పెళ్లంటే ముందుగా గుర్తుకువచ్చేది ప్రీ వెడ్డింగ్ షూట్. ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటారు. కొంతమంది అయితే తమ నిజ జీవితంలో ఇలా చేయాలి, అలా చేయాలి అని కలలు కంటుంటారు. అవి ఎలాగో జరగవు కాబట్టి ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్‌ రూపంలో వారి కలలను నెరవేర్చుకుంటారు. అయితే ఓ పోలీసు ఆఫీసర్ కూడా తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఓ సన్నివేశాన్ని ప్రీ వెడ్డింగ్ షూట్‌ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.  

వివరాలు.. రాజస్థాన్‌లోని మంద్‌ ఫియా పోలీసు స్టేషన్‌ లో ధన్‌పాట్ అనే వ్యక్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. అతనికి రీసెంట్ గా పెళ్లి కుదిరింది. దీంతో ధన్‌పాట్ ముందుగా తన పెళ్లికి సంబంధించి చిన్న ప్రీ వెడ్డింగ్ షూట్‌ చేయించుకున్నాడు. అయితే ఈ షూట్‌ లో ధన్‌పాట్ డ్యూటీలో ఉండగా.. అటు నుంచి ఓ యువతి హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడుపుకుంటూ వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన పోలీసు ఆమెను ఆపి వాహనం కీ తీసుకుంటాడు. వెంటనే ఆమె పోలీసు ఆఫీసర్ ధన్‌పాట్ దగ్గరకు వెళ్లి అతని జేబులో రూ. 500లు లంచంగా పెట్టి.. వెనుక జేబులో ఉన్న పర్స్‌ను దొంగలిస్తోంది. ఇలా అప్పటినుంచి వారిద్దరూ ప్రేమలో పడతారు. అలా ప్రీ వెడ్డింగ్ షూట్ స్వీట్ గా జరిగిపోయింది. 

అంతా బాగానే ఉంది కానీ తన ప్రీ వెడ్డింగ్ షూట్‌ లో ధన్‌పాట్ లంచం ఇచ్చే సన్నివేశాలను చూపించినందుకు ఆ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అతనిపై సీరియస్ అయ్యారు. పోలీసు డ్రెస్ వేసుకుని షూట్ చేయడమే కాకుండా.. ఆ వీడియోలో లంచం తీసుకునే సన్నివేశాలను చూపించడం తప్పు. నీ వల్ల ప్రజలకు పోలీసులంటే ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో ధన్‌పాట్‌ పై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు.