వృద్ధాప్యంలో విజయకేతనం: సర్పంచ్‌గా ఎన్నికైన 97 ఏళ్ల బామ్మ

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 09:04 AM IST
వృద్ధాప్యంలో విజయకేతనం: సర్పంచ్‌గా ఎన్నికైన 97 ఏళ్ల బామ్మ

రాజస్థాన్‌ సికార్ జిల్లాలోని పురానాబాస్‌ గ్రామంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో 97 సంవత్సరాల బామ్మ సర్పంచ్‌గా గెలిచి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోని నీమ్‌ కా థానా సబ్‌ డివిజన్‌, పురానాబాస్‌ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 97 ఏళ్ల విద్యాదేవి సర్పంచ్‌గా పోటీ చేసారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం (జనవరి 17,2020)న పూరైయి ఫలితాలు వెల్లడికాగా విద్యాదేవి గెలిచినట్లుగా తేలింది. 

97ఏళ్ల వృద్ధురాలు పోటీ  చేస్తోంది…ఈవిడేం గెలుస్తుందిలే అని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు విషయాన్ని తేలికగా తీసుకున్నారు. వారి అంచనాలను తల్లిక్రిందులు చేస్తూ విద్యాదేవి విజయకేతనాన్ని ఎగురవేశారు. జరిగిన ఓట్ల లెక్కింపు అనంతరం విద్యాదేవి తన ప్రత్యర్థి మీనాకు 636 ఓట్లు రాగా..విద్యాదేవికి 843 ఓట్లు వచ్చాయనీ..దీంతో విద్యాదేవి 207 ఓట్ల మెజారిటీతో  సర్పంచ్‌గా గెలిచినట్లు ఎన్నికల అధికారి సాధురామ్ జాట్ ప్రకటించారు. దీంతో గ్రామ ప్రజలు సర్పంచ్‌గా ఎన్నికైన బామ్మకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వయస్సులో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించిన బామ్మకు గ్రామ ప్రజలనుంచే గాక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సర్పంచ్‌గా గెలిచిన బామ్మ.. గ్రామానికి సేవ చేయాలనే ఎన్నికల బరిలో నిలిచాననీ.. నన్ను గెలిపించినందుకు, తనకు మద్దతుగా నిలిచినందుకు ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా సాధురామ్ జాట్ మాట్లాడుతూ..విద్యాదేవి జనవరి 1, 1923లో జన్మించారనీ..విద్యాదేవి భర్త శివ్ రామ్ సింగ్ ఆర్మీ  మేజర్ గా పనిచేసేవారనీ తెలిపారు.