రజినీ పొలిటికల్ ఎంట్రీ.. సైకిల్ గుర్తుతో.. జెండా రంగులు.. పార్టీ రిజిస్ట్రేషన్!

  • Published By: vamsi ,Published On : December 11, 2020 / 11:26 AM IST
రజినీ పొలిటికల్ ఎంట్రీ.. సైకిల్ గుర్తుతో.. జెండా రంగులు.. పార్టీ రిజిస్ట్రేషన్!

సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్.. ఎన్నోరోజులుగా పార్టీ పెడుతాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.. అందుకు తగ్గట్టుగా అడుగులు పడని పరిస్థితి.. కానీ, అభిమానులతో మీటింగ్‌లు, సన్నిహితులతో సమాలోచనల తర్వాత రజినీకాంత్ పూర్తిగా రాజకీయ బరిలోకి దిగడానికి సిద్ధమైపోయారు. పార్టీపెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇప్పటికిప్పుడు ప్లానింగ్ అయితే కాదని, అర్థం అయిపోతుంది.



జనవరిలో పార్టీ ప్రకటన తర్వాత నేరుగా జనంలోకి వెళ్లాలనేది రజినీకాంత్ ఆలోచన. భారీఎత్తున పార్టీ సమాశం పెట్టేసి, రాజకీయం మొదలుపెట్టేందుకు కీలకంగా అడుగులు వేస్తున్నారు రజినీకాంత్.. రాజకీయం విషయంలో రజినీకాంత్ తక్కువాడేంకాదు. సినిమాలు చేస్తూనే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఒక కొలిక్కి తెచ్చినట్లుగా చెబుతున్నారు సన్నిహితులు. ఇప్పటికే రజినీకాంత్ 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కమిటీ సభ్యులను ఎంపిక చేసేశారట. దాదాపు 80శాతం పని పూర్తయ్యింది. బీజేపీతో భావజాల సారూప్యం ఉంటుంది తప్ప, పార్టీకి అనుకూలం కాదన్నది రజినీకాంత్ సన్నిహితుల మాట. రాబోయే కాలంలో పొత్తులు, ఎత్తులు ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేశారట తలైవా.



అదే సమయంలో మ్యానిఫేస్ట్ లో ఏం అంశాలు చర్చించాలో ముందుగానే అంచనావేస్తున్నారు. ప్రజాకర్షక విధానాల్లో డిఎంకెది తిరుగులేని రికార్డు. మరి ఏ కొత్త పథకాలను ప్రకటిస్తే ఓటర్లు ఆకర్షితులవుతారన్న దానిమీద రజినీకాంత్‌కు కచ్చితమైన అభిప్రాయం ఉందని, తమిళనాడుని సంక్షేమ రాష్ట్రంగా మార్చితీరుతాని అభిమానులు ఆశిస్తున్నారు.



తన అభిమానుల్లో ఎక్కువమంది దళితులు, బహుజనులు కాగా.. ఆ వర్గాలను దగ్గర చేసుకునేందుకు దళితహీరో పాత్రలను పోషించారు. కబాలి, కాలా సినిమాల్లో దళితులే హీరోలు అనే కాన్సెప్ట్‌తో జనాల్లో తిరిగే వ్యక్తిగా రజినీకాంత్ కనిపించారు. ఇప్పుడు పార్టీ జెండా రూపకల్పనలో కూడా అందుకు తగ్గట్టుగా బులుగు రంగును ఉంచనున్నట్లు చెబుతున్నారు. మూడు రంగులతో పార్టీ జెండా సిద్ధం అవుతోంది. ఇప్పటికే Rajini Makkal Mandram (RMM) ద్వారా పార్టీ పనులను చక్కబెట్టిన తలైవా.. మాజీ ముఖ్యమంత్రి అమ్మ జయలలిత చనిపోయిన తర్వాత వచ్చిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఎన్నికల ముందు అదునుచూసి రాజకీయ బరిలోకి దిగుతున్నారు.



ఈ క్రమంలోనే తలైవా రజినీకాంత్ ఈ రోజు(11 డిసెంబర్ 2020) తన పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. దీని కోసం రజినీకాంత్ ఫోరం అధికారులు న్యాయవాదులతో ఢిల్లీకి వెళ్లారు. తలైవా రజినీకాంత్‌ రాజకీయ పయనంలో సైకిల్‌ చిహ్నం కీలకం అవ్వబోతుంది. అన్నామలై చిత్రం గెటప్‌ను తలపించే విధంగా సైకిల్, పాల క్యాన్‌తో రజినీ స్టైల్‌ను రాజకీయ చిహ్నంగా ఎంపిక చేయడానికి నిర్ణయించారు.



అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అదే గుర్తును ఎన్నికల కోసం వాడుతూ ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ ఇదే గుర్తును వాడుతుంది. ఈ క్రమంలో ఏదేని అభ్యంతరాలు, వివాదాలు తలెత్తే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు రజినీకాంత్. అందుకోసం సైకిల్ గుర్తుతో పాటు పాలక్యానును కలిపేలా.. రజినీకాంత్ నటించిన అన్నామలై చిత్రంలో సైకిల్, పాల క్యాన్‌ గెటప్‌ అభిమానుల్ని అలరించగా.. అదేమాదిరిగా సైకిల్, పాలక్యాన్‌తో చిహ్నం వచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.