బలగాల ఉపసంహరణపై చైనాతో ఒప్పందం..రాజ్ నాథ్ కీలక ప్రకటన

బలగాల ఉపసంహరణపై చైనాతో ఒప్పందం..రాజ్ నాథ్ కీలక ప్రకటన

Rajnath Singh తూర్పు లడఖ్ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న సైనిక ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని గురువారం(ఫిబ్రవరి-11,2021) రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేలా భారత్​-చైనా ఒప్పందం కుదిరిందని రాజ్​నాథ్​ తెలిపారు. దీని ప్రకారం.. ఇరు దేశాలు తమ బలగాలను విడతల వారీగా, సమన్వయంతో వెనక్కి పంపనున్నాయని వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందంలో భారత్ ఎలాంటి షరతులకు అంగీకరించలేదన్నారు.

ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయని.. అయితే కొన్ని ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించడం, పెట్రోలింగ్​ వంటి సమస్యలున్నాయని రాజ్ నాథ్ తెలిపారు. పూర్తి స్థాయి బలగాల ఉపసంహరణపై రానున్న రెండు రోజుల్లో కమాండర్​ స్థాయిలో చర్చలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పాంగాంగ్​ ఉత్తర ప్రాంతంలోని ఫింగర్​ 8 వద్ద చైనా బలగాలు.. భారత బలగాలు ఫింగర్​ 3 వద్ద ఉన్న పర్మనెంట్ బేస్ (ధన్ సింగ్ తాపా పోస్ట్)దగ్గర ఉంటాయని రాజ్ నాథ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భారత జవాన్లపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత జవాన్లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మన భద్రతా బలగాలు రుజువు చేశాయన్నారు. చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేదందుకు భారత్ సిద్దంగా లేదని పార్లమెంట్ వేదికగా మరోసారి రాజ్ నాథ్ స్పష్టం చేశారు.ఎల్ఏసీ వెంబడి శాంతియుత పరిస్థితులు కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.

వాస్తవాధీన రేఖ వెంబడి ప్రశాంత వాతావరణం దెబ్బతింటే భారత్​-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తాయన్నారు రాజ్​నాథ్​​. ఇరు దేశాల సమన్వయంతోనే సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. 1962 యుద్ధం అనంతరం చైనా 39వేల చ.కి.మీ ఆక్రమించింది. లడఖ్‌లోని 5,180 కి.మి. భూమిని పాకిస్తాన్‌ చట్ట విరుద్ధంగా చైనాకు ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 90వేల చ.కి.మీ భూమి తమదేనని చైనా వాదిస్తోంది. కానీ మేం దాన్ని అంగీకరించడం లేదు అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.