అక్టోబర్ వరకు రైతు ఉద్యమం ఆగదు..టికాయత్

అక్టోబర్ వరకు రైతు ఉద్యమం ఆగదు..టికాయత్

Rakesh Tikait                                     నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 69 రోజులుగా అన్నదాతలు చేస్తోన్న పోరాటం ఉవ్వెత్తున సాగుతోంది. చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపబోమని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ తికాయత్ మంగళవారం ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు. చట్టాలను రద్దు చేయకపోతే, తాము ఇళ్లకు వెళ్లేది లేదని, ఇదే తమ నినాదమని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమం అక్టోబరుకు ముందు ముగిసే ప్రసక్తే లేదన్నారు. సమీప భవిష్యత్తులో ఈ ఉద్యమం ముగిసేది లేదన్నారు.

రైతుల ఉద్యమానికి విపక్షాలు మద్దతు పలకడాన్ని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయత్ స్వాగతించారు. అయితే ఉద్యమాన్ని రాజకీయం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. సింఘు బోర్డర్‌లో నిరసన తెలుపుతున్న రైతులను ఉద్దేశించి రాకేష్ టికాయత్ మాట్లాడుతూ… మాకు మద్దతుగా ప్రతిపక్షాలు ఇక్కడికి వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాయకులు వస్తే మేం ఏం అడ్డు చెప్పం. ట్రాఫిక్​కు మేం అంతరాయం కలిగించలేదు. పోలీసులే బారీకేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్​కు అంతరాయం కలిగిస్తున్నారన్నారు. రైతుల నిరసనకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు.

ఇదిలావుండగా, శివసేన నేత సంజయ్ రౌత్ మంగళవారం రాకేశ్ తికాయత్‌ను కలిశారు. ఘాజీపూర్ వద్ద నిరసన తెలుపుతున్న రైతుల శిబిరం వద్ద రాకేశ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా సంజయ్ రౌత్ మాట్లాడుతూ… జనవరి 26న విధ్వంసం జరిగిన తీరు, ఉద్యమాన్ని, తికాయత్‌ను అణచివేసేందుకు జరిగిన ప్రయత్నాలను చూసిన తర్వాత రైతులకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత తమకు ఉందని తాము భావించామని చెప్పారు. యావత్తు మహారాష్ట్ర, శివసేన, ఉద్ధవ్ ఠాక్రేల మద్దతును రైతులకు తెలియజేయవలసిన అవసరం ఉందని భావించినట్లు తెలిపారు.

మరోవైపు, పోలీసులు, అధికారులు తమపై వేధింపులు ఆపేవరకు, అరెస్ట్​ చేసిన రైతులను విడిచిపెట్టేవరకు ప్రభుత్వంతో చర్చలు జరిపే సమస్యే లేదని సంయుక్త కిసాన్ మోర్చా తేల్చిచెప్పింది. బారీకేడ్లను పెంచడం, గోతులు తవ్వడం, రోడ్లపై మేకులు, కంచెలు ఏర్పాటు చేయడం, అంతర్గత రోడ్లను మూసివేయడం, అంతర్జాల సేవలను నిలిపివేయడం, భాజపా-ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలతో మమ్మల్ని రెచ్చగొట్టడం.. ఇవన్నీ మాకు వ్యతిరేకంగా ప్రభుత్వం తమ పోలీసులు, అధికాయ యంత్రాంగంతో చేయిస్తున్నవే సంయుక్త కిసాన్​ మోర్చా పేర్కొంది. ఇంటర్నెట్ ని తరుచుగా నిలిపివేయడం రైతులకు సంబంధిచిన ట్విట్టర్​ ఖాతాలను నిలిపివేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యంపై ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడిగా కిసాన్ మోర్చా అభివర్ణించింది. రైతులకు ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు పెరుగుతుండటం చూసి ప్రభుత్వం భయపడుతోందని పేర్కొంది.

కాగా, సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసనలకు సంబంధం ఉన్న అనేకమంది రైతుల, రైతు సంఘాల ఖాతాలను ట్విట్టర్​ నిలిపివేసింది. జాబితాలో కిసాన్‌ ఏక్తా మోర్చా, బీకేయూ ఏక్తా ఉర్గహన్‌ ఉన్నాయి. వీటితో పాటు పలువురు వ్యక్తులు, సంస్థల ఖాతాలను కూడా ట్విట్టర్‌ నిలిపేసింది.