ఉన్నావ్ అత్యాచారం కేసు : ఎమ్మెల్యే కుల్‌దీప్‌కు జీవిత ఖైదు

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 09:07 AM IST
ఉన్నావ్ అత్యాచారం కేసు : ఎమ్మెల్యే కుల్‌దీప్‌కు జీవిత ఖైదు

ఉన్నావ్ అత్యాచారం కేసులో ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ కు కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే సెంగార్ కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం  చెల్లించాలని ఆదేశించింది. 

2017 జూన్ 4న బాధితురాలిపై ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు స్థానికంగా ఉండే పోలీసుల్ని ఆశ్రయించింది. కానీ పోలీసులు కేసును నమోదుచేయలేదు.  దీంతో బాధితురాలు సీఎం నివాసం ముందు తన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో యూపీ ప్రభుత్వానికి బాధితురాలి విషయంలో స్పందించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.  

కానీ బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతూ వచ్చారు. యువతి తండ్రిపై తప్పుడు కేసులు బనాయించిన పోలీసులు నానా కష్టాలకు గురిచేసారు. ఈ క్రమంలో అతను పోలీస్ స్టేషన్ లోనే మృతి చెందిన పరిస్థితి.  అయినా బాధితురాలు ఏమాత్రం పోరాటాన్ని ఆపలేదు. యూపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. 

అలా ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేతిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ ను అతని సోదరుడ్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాధితురాలు  విచారణ నిమిత్తం  కోర్టు హాజరయ్యేందుకు వెళుతుండగా కొంతమంది ఆమెను యాక్సిడెంట్ చేశారు. ఈ ఘటనలో బాధితురాలి ఇద్దరి బంధువులు చనిపోగా..బాధితురాలు, ఆమె తరపు లాయర్ తీవ్రంగా గాయపడి ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఈ ప్రమాదం వెనుక ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ హస్తం ఉందని బాధితురాలు ఆరోపించింది. సుప్రంకోర్టుకు లేఖ రాసింది. దీంతో సుప్రీంకోర్టు  ఆదేశాలతో స్థానిక పోలీసులు ఆమె కోసం ఓ ప్రత్యేక నివాసాన్ని ఏర్పరిచారు.  

సెప్టెంబర్ 7న కోర్టు విచారణ పూర్తి అవ్వగా..డిసెంబర్ 16న ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ ను దోషిగా తేల్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. కాగా..కుల్ దీప్ సెంగార్ కు జీవిత ఖైదు విధించటంపై బాధితురాలి కుటుంబ సభ్యులు స్పందిస్తూ..జీవితఖైదు సరిపోదని ఉరి శిక్ష వేయాలని కోరుతున్నారు.