కరోనా ట్రీట్మెంట్ కు బ్యాంక్ లోన్..ఆర్బీఐ గవర్నర్

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతున్న సమయంలో దేశంలోని వైద్య సదుపాయాలు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదరువుతున్నాయి.

కరోనా ట్రీట్మెంట్ కు బ్యాంక్ లోన్..ఆర్బీఐ గవర్నర్

Rbi Allows Loan Restructuring For Individuals Msmes Hit By Fresh Covid 19

RBI దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతున్న సమయంలో దేశంలోని వైద్య సదుపాయాలు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదరువుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య రంగం బలోపేతంలో భాగంగా కరోనా సంబంధిత వైద్యవిభాగాల కోసం ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసెస్ కింద రూ.50 వేలకోట్ల నిధులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్‌ శక్తి కాంతదాస్‌ బుధవారం ప్రకటించారు. ఈ నిధులను బ్యాంకులు వ్యాక్సిన్‌ తయారీ లేదా దిగుమతి చేసే సంస్థలకు, సౌకర్యాలు మెరుగుపరుచునేందుకు హాస్పిటల్స్, ల్యాబ్స్ కు కూడా రుణాలు ఇవ్వనున్నారు. రెపొ రేటుకు సమానంగా ఈ రుణాల వడ్డీని నిర్ణయించారు. అంటే ఆర్బీఐ నుంచి బ్యాంకులు ఎంత శాతం వడ్డీకి డబ్బులు తీసుకుంటాయో, అంతే శాతాన్ని వినియోగదారుడి నుంచి వడ్డీగా తీసుకోవాలన్నమాట. ఈ మేరకు బ్యాంకులు కొవిడ్ లోన్ బుక్ ను ఏర్పాటుచేసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది.

అయితే, కరోనా సోకిన వ్యక్తులు ట్రీట్ మెంట్ కోసం లోన్ కూడా తీసుకోవచ్చని,కోవిడ్ కారణంగా దెబ్బతిన్న MSME(సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు)కూడా లోన్ తీసుకోవచ్చునని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ టర్మ్ లిక్విడిటీ సదుపాయంలోనే ”పర్సనల్ కొవిడ్ లోన్స్”ను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. తనకున్న అర్హతలను బట్టి ఓ కరోనా రోగి ట్రీట్ మెంట్ కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకోవచ్చు. ఇలాంటి రుణాలకు కాలపరిమితిని మూడేళ్లుగా నిర్ణయించారు. కాగా, ఇప్పటికే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కరోనా ట్రీట్ మెంట్ ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ మేరకు కొత్తగా హెల్త్ పాలసీలు తీసుకోవచ్చు. లేదంటే నిర్ణీత మొత్తం చెల్లించి, ఉన్న పాలసీనే కరొనా ట్రీట్ మెంట్ కు అప్ గ్రేడ్ అవ్వొచ్చు. ఇవి కాకుండా నేరుగా ట్రీట్ మెంట్ కోసం రుణాలు తీసుకోవాలనుకున్నా ఇప్పుడు సాధ్యమే.

కరోనా కేసులు విషయాన్ని కేంద్ర బ్యాంకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుందన్నారు శక్తికాంత్ దాస్. కరోనా సంక్షోభం నుంచి బయటపడడానికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న ఫైనాన్స్ సంస్థల కోసం రూ. 10 వేల కోట్ల దీర్ఘకాల రుణాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో రుణాల రీస్ట్రక్చర్ వాడుకున్న వారికి మరో రెండేళ్లపాటు మారటోరియం పొందే ఛాన్స్ ఇచ్చారు. రూ. 35 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలును మే 20న ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వ్యవధిని 50 రోజులకు పెంచారు. ఇప్పటివరకు ఈ వ్యవధి 36 రోజుల వరకు ఉండేది. ఈ కరోనా సంక్షోభ సమయంలో వీడియో ద్వారా వినియోగదారులకు కేవైసీ అప్‌డేట్‌ సౌకర్యం కల్పించింది ఆర్బీఐ. కేవైపీ అప్‌డేట్‌ కాని యూజర్లపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు ఉండవని ఆర్బీఐ తెలిపింది.కరోనాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ సిబ్బందికి శక్తికాంతదాస్ ధన్యవాదాలు తెలిపారు.