Digital Rupee in India : డిజిటల్ రూపీ అంటే ఏంటి? డిజిటల్ రూపాయితో ఉన్న అవసరమేంటి?

పాత నోట్లను చూశాం.. కొత్త నోట్లను గట్టిగా వాడేస్తున్నాం.. డిజిటల్ చెల్లింపుల్లోనూ మనమే ముందున్నాం. ఇవన్నీ దాటుకొని.. ఇండియా ఇప్పుడు డిజిటల్ రూపీ దాకా వచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలో ప్రయోగాత్మకంగా ఈ-రూపీని ప్రారంభించింది. దీంతో.. కంట్రీ మొత్తం ఈ-రూపీ మీదే చర్చ జరుగుతోంది. మరి.. డిజిటల్ రూపీ అంటే ఏంటి? అదెలా ఉంటుంది? ఎవరు జారీ చేస్తారు? డిజిటల్ రూపాయితో ఉన్న అవసరమేంటి?

Digital Rupee in India : డిజిటల్ రూపీ అంటే ఏంటి? డిజిటల్ రూపాయితో ఉన్న అవసరమేంటి?

Digital Rupee in India

Digital Rupee in India : పాత నోట్లను చూశాం.. కొత్త నోట్లను గట్టిగా వాడేస్తున్నాం.. డిజిటల్ చెల్లింపుల్లోనూ మనమే ముందున్నాం. ఇవన్నీ దాటుకొని.. ఇండియా ఇప్పుడు డిజిటల్ రూపీ దాకా వచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలో ప్రయోగాత్మకంగా ఈ-రూపీని ప్రారంభించింది. దీంతో.. కంట్రీ మొత్తం ఈ-రూపీ మీదే చర్చ జరుగుతోంది. మరి.. డిజిటల్ రూపీ అంటే ఏంటి? అదెలా ఉంటుంది? ఎవరు జారీ చేస్తారు? డిజిటల్ రూపాయితో ఉన్న అవసరమేంటి?

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ రూపీని మరో కీలక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా నగదు లావాదేవీలు, ఆన్‌లైన్ చెల్లింపులను చూసిన భారత్.. ఇక డిజిటల్ రూపీని కూడా వాడేందుకు సిద్ధమైంది. రిటైల్ డిజిటల్ రూపీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కొందరు కస్టమర్లు, మర్చంట్‌లతో కూడిన బృందానికి.. డిజిటల్ రూపీ ద్వారా లావాదేవీలు జరిపేందుకు అవకాశం కల్పించారు. రియల్ టైమ్‌లో డిజిటల్ రూపీని సృష్టించడం, పంపిణీ చేయడం, రిటైల్ కస్టమర్లు వినియోగించడం లాంటివన్నీ పైలట్ ప్రాజెక్ట్‌లో పరిశీలిస్తారు. అవసరమైన మార్పు చేర్పులు చేసి.. వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు.

డిజిటల్ రూపీ అనేది.. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. ఇది కూడా మామూలు డబ్బుల మాదిరిగానే పని చేస్తుంది. దీని విలువ ప్రస్తుతం ఉన్న కరెన్సీ మాదిరిగానే ఉంటుంది. ఆర్బీఐ.. మొదటగా రిటైల్ డిజిటల్ రూపీని పరీక్షిస్తోంది. దీనిని డిజిటల్ టోకెన్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న 2 వేలు, 5 వందలు, 2 వందలు, వంద రూపాయల కరెన్సీ డినామినేషన్లలోనే దీనిని కూడా జారీ చేస్తారు. బ్యాంకులు.. ఈ-రూపీని డిజిటల్ వ్యాలెట్ ద్వారా ఆఫర్ చేస్తాయి. వినియోగదారులు తమ మొబైల్‌లోనూ, ఇతర ఎలక్ట్రానికి డివైజ్‌లలో ఈ డిజిటల్ వ్యాలెట్‌ను స్టోర్ చేసుకోవచ్చు. డిజిటల్ రూపాయికి ఉన్న మరో పేరు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. దీనినే.. సీబీడీసీ అని కూడా పిలుస్తారు. ఇది క్రిప్టో కరెన్సీ తరహాలోనే బ్లాక్ చెయిన్ టెక్నాలజీతోనే రూపొందుతుంది. దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచడంతో పాటు ఫిజికల్ కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా.. ఆర్‌బీఐ డిజిటల్ రూపాయిని తీసుకొచ్చింది. డిజిటల్ రూపీ వర్చువల్ కరెన్సీ కాబట్టి.. దానికి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా.. ఆఫ్‌లైన్‌లోనూ వాడొచ్చు. కాబట్టి విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా.. డిజిటల్ రూపీ పని చేస్తుంది.

డిజిటల్ రూపీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తే.. బ్యాంకులు దాన్ని పంపిణీ చేస్తాయి. ఆర్బీఐ చెబుతున్న దాని ప్రకారం.. డిజిటల్ రూపీ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి.. టోకెన్ ఆధారిత డిజిటల్ రూపీ. ఇది.. కరెన్సీ నోటు లాంటిదే. ఇది ఎవరి దగ్గర ఉంటే వారే దానికి యజమానులు. ఈ టోకెన్ డిజిటల్ రూపీని.. రిటైల్ లావాదేవీలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకరంగా.. ఇది పేపర్ కరెన్సీ లాంటిదే. రెండోది.. అకౌంట్ ఆధారిత డిజిటల్ రూపీ. దీనిని.. ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వాడటానికి అనుమతి ఉంటుంది. టోకు లావాదేవీలకు గానీ, బ్యాంకుల మధ్య ట్రాన్సాక్షన్లకు గానీ దీనిని వాడతారు. ఈ డిజిటల్ రూపీ.. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్‌లో భాగం. ఇది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన చట్టబద్ధమైన కరెన్సీ. సీబీడీసీలను ఆర్‌బీఐ నేరుగా జారీ చేయడంతో పాటు వాటిని కంట్రోల్ చేస్తుంది. బ్యాంకులు కేవైసీ, అకౌంట్ కీపింగ్ లాంటి నిర్వహణ పరమైన కార్యకలాపాలు చూసుకుంటాయి.

ఇక.. ఆర్బీఐ జారీ చేసిన కాన్సెప్ట్ నోట్ ప్రకారం.. వాలెట్‌లో ఉంచే డిజిటల్ రూపాయి మీద బ్యాంకులు వడ్డీ చెల్లించవు. అలా చేయడం వల్ల.. బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేసి.. ఖాతాదారులు డిజిటల్ రూపీలో పొదుపు చేయడం మొదలు పెడతారు. అది బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టం చేస్తుంది. అయితే.. డిజిటల్ రూపీని.. బ్యాంక్ డిపాజిట్లుగా మార్చుకునే వెసులుబాటైతే ఉంది. ఇతర పేమెంట్స్‌తో పోలిస్తే.. డిజిటల్ రూపీ కొంతవరకు మెరుగైనదే అని చెప్పొచ్చు. డిజిటల్ రూపాయిని వాడటం వల్ల.. ఇంటర్ బ్యాంక్ సెటిల్‌మెంట్స్ అవసరం ఉండదు. ఆర్థిక లావాదేవీల్లోనూ బ్యాంకుల మధ్యవర్తిత్వం అవసరం లేదు. తక్కువ ఖర్చుతో.. రియల్ టైంలో లావాదేవీలు పూర్తవుతాయి. ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే వారికి ఇది చాలా సులభంగా ఉంటుంది. మధ్యవర్తులెవరూ లేకుండానే.. డిజిటల్ డాలర్ల రూపంలో సులభంగా చెల్లింపులు చేయొచ్చు.

డిజిటల్ రూపీ పైలట్ ప్రాజెక్ట్ కోసం రిజర్వ్ బ్యాంక్ 3 నగరాలను ఎంపిక చేసింది. అందులో దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు, భువనేశ్వర్‌లో ముందుగా డిజిటల్ రూపీ లావాదేవీలు జరుగుతాయి. రెండో దశలో మరో తొమ్మిది నగరాల్లో డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తెస్తారు. త్వరలోనే హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, గ్యాంగ్‌టక్‌, గువాహటి, ఇండోర్‌, కొచ్చి, లక్నో, పట్నా, షిమ్లాకు ఈ-రూపీ సేవలను విస్తరించనున్నారు. మొదటగా.. రిటైల్ డిజిటల్ రూపీని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుల ద్వారా అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు కూడా డిజిటల్ రూపీని పంపిణీ చేయనున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా.. భవిష్యత్‌లో మరిన్ని నగరాలకు డిజిటల్ రూపీ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది ఆర్బీఐ.