సుప్రీం “స్టే”తో చట్టాల రద్దు అనే ప్రశ్నకి తెరపడింది

సుప్రీం “స్టే”తో చట్టాల రద్దు అనే ప్రశ్నకి తెరపడింది

Agri minister to farmers నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు విధించిన స్టేతో చట్టాల రద్దు అనే ప్రశ్నకు తెరపడిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై చాలా మంది రైతులు, నిపుణులు అనుకూలంగా ఉన్నారని తోమర్ తెలిపారు. చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల భయాలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తోమర్ స్పష్టం చేశారు.

మండీలు, వ్యాపారుల రిజిస్ట్రేషన్ ​తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించేందుకు రైతు సంఘాలకు ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. పంట వ్యర్థాల్ని తగలబెట్టడం, విద్యుత్తు​ వినియోగంపైనా చర్చించేందుకూ ప్రభుత్వం అంగీకరించిందని… కానీ మూడు చట్టాలు రద్దు చేయడమే ముఖ్యమని రైతు సంఘాలు మొండి పట్టుతో ఉన్నట్లు తోమర్ తెలిపారు. ఈ నెల 19న జరిగే సమావేశంలో రైతు సంఘాలు క్లాజుల వారిగా చర్చకు సిద్ధం కావాలని సూచించారు తోమర్. చట్టాల్లో ఏ ఏ మార్పులు అవసరమో చెప్పాలని కోరారు.

కాగా, నూతన సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈనెల 19న తొలిసారి భేటీ కానున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు, ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీ కోసం పంజాబ్​ లోని లుథియానా నుంచి ఇవాళ పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లలో ఢిల్లీకి బయల్దేరారు.