Twitter India Head : అరెస్ట్ చేయనంటే పోలీసుల ఎదుట హాజరవుతా

తనను అరెస్ట్‌ చేయరని గ్యారంటీ ఇస్తే 24 గంటల్లోగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్దమేనని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్‌ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు.

Twitter India Head : అరెస్ట్ చేయనంటే పోలీసుల ఎదుట హాజరవుతా

Manish

Twitter India Head తనను అరెస్ట్‌ చేయరని గ్యారంటీ ఇస్తే 24 గంటల్లోగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్దమేనని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్‌ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. కాగా,బెంగళూరు నివాసి అయిన మనీష్ మహేశ్వరి ఇటీవల ఘజియాబాద్‌లో ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి వీడియో విషయమై మనిష్‌ మహేశ్వర్‌ కి ఘజియాబాద్‌ పోలీసులు సెక్షన్ 41కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వర్చువల్‌ పద్ధతిలో హాజరవుతానని మనీశ్‌ జవాబివ్వగా అందుకు ఘజియాబాద్‌ పోలీసులు నిరాకరించారు.

ఈ నేపథ్యంలో ఘజియాబాద్ పోలీసుల సమన్లను సవాల్ చేస్తూ గత నెలలో మనీశ్.. కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ ఇవాళ విచారణ సందర్భంగా..యూపీ పోలీసులు తనపై చేయి వేయబోమని కోర్టుకు అండర్‌టేకింగ్‌ ఇస్తే.. తాను వ్యక్తిగతంగా పోలీసులు ఎదుట హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాను అని తన లాయర్ ద్వారా కోర్టుకి మనీశ్ తెలిపారు. అయితే తాము మనీశ్ ని అరెస్ట్ చేయాలన్నది తమ ఉద్దేవం కాదని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు. కాగా, వృద్ధుడిపై దాడి వీడియో కేసులో ట్విట్టర్ ఇండియా మరియు మనీశ్ మహేశ్వరి కనెక్షన్ గురించి యుపీ పోలీసులను అడిగిన తర్వాత విచారణను కోర్టు బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు వాయిదా వేసింది.

అసలేం జరిగింది
గాజియాబాద్​కు చెందిన సూఫీ అబ్దుల్ సమద్ అనే ముస్లిం వృద్ధుడిని నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొడుతూ, గడ్డం కత్తిరిస్తూ ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేయాలని బెదిరిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో ఒకటి గత నెలలో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ట్విటర్‌ మాధ్యమాన్ని ఉపయోగించి కొందరు ఆ వీడియోని వైరల్‌ చేశారు. అయితే మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ఆ వీడియోను వైరల్‌ చేసిందంటూ ట్విటర్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోను షేర్ చేసిన అకౌంట్లపై ట్విట్టర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. సంఘ విద్రోహ శక్తుల సందేశాల్ని అలా ఎలా జనాలకు చేరవేస్తారు అంటూ ట్విట్టర్ ఎండీకి పంపిన నోటీసుల్లో పోలీసులు ప్రశ్నించారు. ఇక ఈ వీడియో వ్యవహారంలో ఇప్పటికే కొందరు జర్నలిస్టులు, కాంగ్రెస్‌ లీడర్ల పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు

మతపరమైన కోణంలో వృద్ధుడిపై దాడి జరిగిందన్న వాదనను గాజియాబాద్ పోలీసులు తోసిపుచ్చారు. ఇందులో మత కోణం లేదన్నారు. వివిధ రకాల జబ్బులను నయం చేస్తానని చెప్పి సమద్.. తాయత్తులు విక్రయిస్తూంటాడని.. ఈ క్రమంలోనే రోగాల బారిన పడిన తన కుటుంబ సభ్యుల కోసం గుర్జర్‌ అనే వ్యక్తి కొన్ని తాయత్తులను కొన్నాడని.. ఆశించిన ఫలితం రాలేదనే కోపంలో ఇతరులతో కలసి దాడికి దిగాడని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.