Third Wave: మూడో వేవ్‌పై కేంద్రం అలర్ట్.. ఆరు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌పై ఫోకస్

కరోనా థర్డ్ వేవ్ ఏ క్షణమైనా ముంచుకొచ్చే ప్రమాదముండటంతో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Third Wave: మూడో వేవ్‌పై కేంద్రం అలర్ట్.. ఆరు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌పై ఫోకస్

Ox Beds

Readying for Third Wave: కరోనా థర్డ్ వేవ్ ఏ క్షణమైనా ముంచుకొచ్చే ప్రమాదముండటంతో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఒక వేళ థర్డ్ వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపి ఆక్సిజన్ బెడ్స్ అవసరమైతే.. వాటి కొరత లేకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యవసర ఆరోగ్య ప్యాకేజ్‌లో భాగంగా.. ఆమోదించిన పీడియాట్రిక్ ఆక్సిజన్‌ బెడ్స్‌లో యాభై శాతం బెడ్స్‌ను ఆరు రాష్ట్రాలకు కేటాయించనుంది.

సెకండ్ వేవ్ సమయంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కరోనా బారిన పడటంతో.. ఈ పీడియాట్రిక్ బెడ్స్‌ను ఆయా రాష్ట్రాల్లో రూరల్ ఏరియాలకు కేటాయిస్తున్నారు. మొత్తం 75వేల 218 పీడియాట్రిక్ ఆక్సిజన్ బెడ్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపితే.. వాటిలో 60 శాతం బెడ్స్‌ ఈ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు యూపీ, బీహార్, ఒడిశా, అసోం, జార్ఖండ్ రాష్ట్రాల్లో జిల్లా స్థాయిల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు…

దేశవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కొరత కారణంగా మొదటి, సెకండ్ వేవ్‌లో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆక్సిజన్ బెడ్స్‌ అందక ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి పరిస్థితులు థర్డ్ వేవ్ సమయంలో రిపీట్ కాకుండా చూసేందుకు కేంద్రం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా చిన్నారులు కరోనా బారిన పడితే హెల్త్ కేర్ సిస్టమ్‌ వేగంగా స్పందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

వివిధ రాష్ట్రాల అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ… 19 వేల 30 పీడియాట్రిక్ ఆక్సిజన్ బెడ్స్‌తో పాటు.. 10 వేల 428 పీడియాట్రిక్ ఐసీయూ బెడ్స్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా నిధులను సమకూర్చుతుంది. ఈ ప్యాకేజ్‌లో భాగంగా కొన్ని రాష్ట్రాలు జిల్లా స్థాయిలో వెయ్యికి పైగా పీడియాట్రిక్ ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది.