జైళ్లల్లో గోశాలలు ఏర్పాటు చేయాలి…ఆర్ఎస్ఎస్ చీఫ్

  • Published By: venkaiahnaidu ,Published On : December 8, 2019 / 11:21 AM IST
జైళ్లల్లో గోశాలలు ఏర్పాటు చేయాలి…ఆర్ఎస్ఎస్ చీఫ్

దేశ వ్యాప్తంగా ఉ‍న్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగత్‌ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. శనివారం(డిసెంబర్-7,2019) పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…ఆవు విశ్వానికి తల్లి. ఇది మట్టిని పెంచుతుంది, జంతువులను, పక్షులను పెంచుతుంది. ఇది మానవులను కూడా పెంచుతుంది. వ్యాధుల నుండి రక్షిస్తుంది. మానవ హృదయాన్ని పువ్వులాగా మృదువుగా చేస్తుంది. ఆవుల పెంపకం వల్ల ఖైదీల మానసిక స్థితిలో మార్పును తీసుకురాగలిగామని కొందరు జైలర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ పద్ధతిని దేశంలో ఉన్న అన్ని జైళ్లలో అమలు పరచాల్సిన అవసరం ఉంది.

ఖైదీల మానసిక పరిస్థితిని ఆవుల పెంపకానికి ముందు, ఆ తర్వాత ఎలా ఉందనేది మానసిక నిపుణులతో శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలి. ఆ తర్వాత వాటిని రికార్డు చేసి డాక్యుమెంటేషన్‌ చేయాలి. ఇలా వేలాది జైళ్ల నుంచి ఒకే రకమైన ఫలితాలతో రిపోర్టులు వస్తే అది ఒక వాస్తవంగా అంతర్జాతీయ సమాజం ముందు ఆవిష్కరించవచ్చని తెలిపారు.  సమాజ శ్రేయస్సు కోసం ప్రజలు ఆవుల సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మరోవైపు ఆవు పట్ల విదేశీయుల ధృక్కోణాన్ని భగవత్  వివరించారు. ఆవు అంటే పాలు, మాంసం కోసం పెంచుకునేదిగా విదేశీయులు భావిస్తారని, అదే భారతీయ సంస్కృతిలో ఆవు పట్ల ప్రజలు మానసిక బంధం ఏర్పరచుకుంటారన్నారు. దానికి ఉదాహరణగా మన దేశంలో ఆవును వాణిజ్య వస్తువుగా చూడరని, ఆవు సంబంధిత ఉత్పత్తులను అమ్ముకోరని తెలిపారు. ఆవు ప్రాముఖ్యత తెలిసిన మన పూర్వీకులు రసాయన ఎరువులు లేకుండా ఆవు పేడతో వ్యవసాయం చేసేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని భగవత్ తెలిపారు.