మహారాష్ట్రలో మళ్లీ కరోనా విశ్వరూపం, మూడున్నర నెలల తర్వాత ఇదే తొలిసారి

మహారాష్ట్రలో మళ్లీ కరోనా విశ్వరూపం, మూడున్నర నెలల తర్వాత ఇదే తొలిసారి

record corona virus cases in maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభించింది. మూడున్నర నెలల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న(ఫిబ్రవరి 19,2021) 6వేల 112 కేసులు రికార్డ్ అయ్యాయి. అక్టోబర్(2020) 30 తర్వాత 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అక్టోబర్ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

నిన్న నమోదైన కేసుల్లో అకోలా, పూణె, ముంబై డివిజన్‌లలోనే అత్యధికంగా వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20లక్షల 87వేల 632కు చేరినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

పెరుగుతున్న కేసులు, తగ్గుతున్న రికవరీలు:
కరోనా కారణంగా నిన్న 44 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనాకు బలైన వారి సంఖ్య 51వేల 713కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తుండగా అదే సమయంలో రికవరీల సంఖ్య గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న 2వేల 159 మంది మాత్రమే కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 44వేల 765గా ఉంది.

చలి, నిర్లక్ష్యమే కారణం:
మరోవైపు, గతేడాది(2020) సెప్టెంబర్ లో కరోనా బారినపడి కోలుకున్న మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి బచ్చు కడుతోపాటు ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే రెండోసారి కరోనా బారినపడ్డారు. ఖడ్సేకు గతేడాది నవంబరులో కరోనా సోకగా చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా తాము రెండోసారి కరోనా వైరస్ బారినపడినట్టు వారిద్దరూ ట్విట్టర్ లో తెలిపారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని, వైరస్ వ్యాప్తి మళ్లీ పెరగడానికి అదే కారణమని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి తెలిపారు. దానికి తోడు చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల గాలికి వదిలేశారు. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం కూడా వైరస్‌ విజృంభణకు కారణమవుతోందని వివరించారు.

కాగా, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,77,387కు చేరింది. మృతుల సంఖ్య 1,56,212కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,78,048 మంది కోలుకున్నారు. 1,43,127 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,07,15,204 మందికి వ్యాక్సిన్ వేశారు.