Heavy Rainfall In Kerala : కేరళలో వర్ష బీభత్సం..మునిగిన కార్లు,బస్సులు..5 జిల్లాల్లో రెడ్ అలర్ట్

కేరళను భారీ వరదలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు,వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Heavy Rainfall In Kerala :  కేరళలో వర్ష బీభత్సం..మునిగిన కార్లు,బస్సులు..5 జిల్లాల్లో రెడ్ అలర్ట్

Kerala

Heavy Rainfall In Kerala కేరళను భారీ వరదలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు,వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరపి లేని వానకు రహదారులు చెరువులుగా మారగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా ప‌థ‌నంథిట్ట‌, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)హెచ్చరికలతో ఆ ఐదు జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. అదేవిధంగా భారీ వ‌ర్ష‌సూచ‌న ఉన్న ఏడు జిల్లాలు- తిరువ‌నంత‌పురం, కొల్లామ్‌, అల‌ప్పుజ‌, పాల‌క్కాడ్‌, మ‌ల‌ప్పురం, కోజికోడ్‌, వాయ‌నాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అల‌ర్ట్ జారీచేశారు. అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం కార‌ణంగా రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపిన‌ట్లు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు. ప్ర‌జ‌లు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. ,లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. ఇదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కాగా, భారీ వర్షాల తిరువనంతపురంలో పలు రహదారులు జలమయం కాగా.. ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం వల్ల తెన్‌మల డ్యాం గేట్లను అధికారులు ఎత్తివేయగా సమీపంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

పథనంతిట్ట జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉండగా ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ అక్కడి పరిస్థితులను సమీక్షించారు. జిల్లాలోని అనతోడు, కక్కి డ్యాంల నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతుండటం వల్ల అధికారులు గేట్లు ఎత్తివేశారు. డ్యాం పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అలప్పుజా, ఇడుక్కి, కుట్టనాడ్‌లనూ భారీ వర్షాలు కుదిపేయగా ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు జలమయంగా మారాయి.

కొట్టాయం గ్రామీణ ప్రాంతంలో భారీ వానలకు రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ఒక కారు కొట్టుకుపోతుండగా, నడుంలోతు నీటిలో దిగిన స్థానికులు తాడు సహాయంతో ఆ కారును పక్కకు లాగారు. అలాగే పూంజార్‌లో కేఎస్‌ఆర్టీసీ బస్సు వర్షం నీటిలో చిక్కుకున్నది. దీంతో అందులోని ప్రయాణికులను స్థానికులు రక్షించారు. కొన్ని జిల్లాల్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట జిల్లాల్లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగాయి.

కేరళ తీరంలో ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్టోబర్ 17 ఉదయం వరకు చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18 మరియు 19 వ తేదీ నుండి వర్షపాతం తగ్గే అవకాశం ఉంది అని వాతావరణ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పర్వతాల సమీపంలో, నదుల సమీపంలో నివసించేవారు అలెర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు.


.