ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌కు రెడీ అయిపోయిన రెడ్ ఫోర్ట్

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌కు రెడీ అయిపోయిన రెడ్ ఫోర్ట్

స్వాతంత్ర్య దినోత్సవానికి ఢిల్లీలోని ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 74వ ఇండిపెండెన్స్‌ డే ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ హోరెత్తుతున్నాయి. ఎందరో వీరుల త్యాగఫలంతో మన దేశానికి విముక్తి లభించిన రోజైన ఆగస్టు 15ను ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు యావత్ జాతి సిద్ధమైంది. జాతి, కులం, మతం, ప్రాంతం అనే తేడాలనేవి లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే వేడుకే పంద్రాగస్టు పండుగ. పార్లమెంట్ భవనం, ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్‌తో పాటు పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలకరించారు.

ఏటా పంద్రాగస్టు వేడుకలకి 30వేల మంది హాజరవుతారు. 12వేల మంది స్కూల్ విద్యార్థులకు ఎంట్రీ ఉంటుంది. అయితే కరోనా ఎఫెక్ట్‌, ఉగ్రదాడుల హెచ్చరికలతో ఎర్రకోట పరిసరాల్లో ఆంక్షలు విధించారు. భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. మూడుకిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. 300ల సీసీ కెమెరాలతో మినిట్ టు మినిట్ పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు వేదికపై కూర్చునేందుకు 110మందికి మాత్రమే అధికారులు ఏర్పాట్లు చేశారు.

వేడుకలకి 250మంది ప్రముఖులు, 1500మంది కరోనా వారియర్స్‌, వైద్యులు, మెడికల్ సిబ్బంది, 500మంది ఎన్‌సీసీ క్యాడెట్స్‌తో పాటు పరిమిత సంఖ్యలో ఉండే ప్రజల మధ్య మోడీ జెండా ఎగురవేయనున్నారు. పరేడ్‌లో పాల్గొనే 350 మంది పోలీసులను ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంచారు.

కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ఢిల్లీ కంటోన్‌మెంట్ లోని పోలీస్ క్వార్టర్స్‌కు తరలించారు. రెడ్‌ ఫోర్ట్‌ దగ్గర ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ కొనసాగుతుండడంతో నేతాజీ సుభాష్‌ మార్గ్, లోథీ రోడ్‌, ఎస్పీ ముఖర్జీ మార్గ్‌, చాందినీ చౌక్‌, రాజ్‌ఘాట్‌, ఐఎస్‌బీటీ రోడ్లను క్లోజ్ చేశారు.

పంద్రాగస్టు వేడుక అనగానే ఎర్రకోట కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. ఈ కోట ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడంతో పాటు మన ఏడు వింతల్లో కూడా ఒకటి. అంతేకాదూ.. స్వాతంత్య్ర సంబరాలకు చిహ్నంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రధానులంతా ఇదే కోటపై జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈ సారి మోడీ ప్రజలకు ఎలాంటి కానుకలు ప్రకటిస్తారు..? ఏం సందేశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.