బీజేపీ పాలన బ్రిటీషర్లను మించిపోయింది..ఎర్రకోట ఘటన వాళ్ల ఫ్లానే

బీజేపీ పాలన బ్రిటీషర్లను మించిపోయింది..ఎర్రకోట ఘటన వాళ్ల ఫ్లానే

Arvind-kejriwal

kejriwal కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన బ్రిటీషర్లను మించిపోయిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. సాగు చట్టాల పేరుతో కేంద్రం రైతుల పాలిట మరణశాసనాలు రాస్తోందన్నారు. బ్రిటీషర్లు కూడా రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టలేదని, రోడ్ల మధ్యలో మేకులు ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. ఆదివారం ఉత్తర్​ప్రదేశ్​లోని మీరట్ లో జరిగిన “కిసాన్ మహాపంచాయత్”లో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు డెత్ వారెంట్ లాంటివని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రభుత్వం వారి భూములను లాక్కొని ముగ్గురు లేదా నలుగురు పెట్టుబడిదారులకు ఇవ్వాలనుకుంటున్నదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తే కర్షకులు వారి సొంత పొలాల్లోనే కూలీలుగా మారతారన్నారు. అందువల్ల రైతులకు పోరాడటం లేదా చనిపోవడం అన్న పరిస్థితి నెలకొన్నదని అన్నారు.

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో జరిగిన హింసాకాండకు బీజేపీనే కారణమని కేజ్రీవాల్​ ఆరోపించారు. నిరసనకారులకు ఢిల్లీ వీధులు తెలియకపోవడంతో ఉద్దేశపూర్వకంగా వారికి తప్పుడు మార్గాన్ని చూపించినట్లు చాలా మంది తనకు చెప్పారన్నారు. ఎర్రకోట ఘటన బీజేపీ నాయకుల పథకం ప్రకారమే జరిగిందని విమర్శించారు. అనుకున్న విధంగానే ఆందోళనకారులను కమల దళం ఎర్రకోట వైపు పంపారు. అక్కడ జెండా ఎగరవేసింది కూడా బీజేపీ కార్యకర్తలేనని కేజ్రీవాల్ అన్నారు. రైతులెప్పుడూ జాతి వ్యతిరేక పనులు చేయరన్నారు. కేంద్ర ప్రభుత్వం మన రైతులను దేశ వ్యతిరేకులుగా ముద్ర వేసి కేసులు నమోదు చేసిందని కేజ్రీవాల్‌ విమర్శించారు. బీజేపీ నేతలు మన రైతులను ఉగ్రవాదులుగా పేర్కొంటున్నారని, బ్రిటీషర్లు కూడా తమ పాలనలో ఇలాంటి ధైర్యం చేయలేదని అన్నారు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు.