రెడ్ లైట్ ఆన్…గాడీ ఆఫ్ : పొల్యూషన్ పై ఫైట్ కు కేజ్రీవాల్ పిలుపు

  • Published By: venkaiahnaidu ,Published On : October 15, 2020 / 03:50 PM IST
రెడ్ లైట్ ఆన్…గాడీ ఆఫ్ : పొల్యూషన్ పై ఫైట్ కు కేజ్రీవాల్ పిలుపు

వాయు కాలుష్యం..మనుషుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తుంది. కనిపించకుండా ప్రాణాల్ని హరించేస్తుంది. భారత్ లో వాయుకాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. రోజు రోజుకూ ఢిల్లీలో భారీస్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఢిల్లీలో వాయుకాలుష్యం తగ్గించే దిశగా కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 20 కోట్ల రూపాయల ఖ‌ర్చుతో స్మాగ్ ట‌వ‌ర్‌ను నిర్మించే ప్రతిపాదనకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గాలిలో ఉన్న కాలుష్యాన్ని పీల్చే స్మాగ్ ట‌వ‌ర్లు.. ఆ త‌ర్వాత స్వ‌చ్ఛ‌మైన గాలిని విడుద‌ల చేస్తాయి.



కాగా, ఇప్పుడు వాయు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు రెడ్‌లైట్ ఆన్‌.. గాడీ ఆఫ్ ప్ర‌చారాన్ని ఆప్ ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. అంటే రోడ్డుపై రెడ్ సిగ్న‌ల్ ప‌డ‌గానే.. వెంట‌నే వాహనాల్ని ఆఫ్ చేయాలి. ఢిల్లీలో సుమారు కోటి రిజిస్టర్డ్‌ వాహ‌నాలు ఉన్నాయ‌ని, ప్రతిరోజూ 30-40లక్షల వాహనాలు రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇంజిన్ ను ఆన్ చేసి ఉండటం వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం లెవల్స్ పెరిగిపోతాయని కేజ్రీవాల్ చెప్పారు. సగటున ఒక వాహనం రోజులో 15-20నిమిషాల పాటు రెడ్ సిగ్నల్ దగ్గర ఆగుతుంటుందని..దీని వల్ల ఒక్కో వాహనం సుమారు 200 ml ఆయిల్ ఖర్చు అవుతుందని…ఇది చాలా పొల్యూషన్ ను క్రియేట్ చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారని కేజ్రీవాల్ తెలిపారు.

ఒక‌వేళ 10 ల‌క్ష‌ల వాహ‌నాలు రెడ్ సిగ్న‌ల్స్ వ‌ద్ద త‌మ వాహ‌నాల్ని స్విచ్ ఆఫ్ చేస్తే , అప్పుడు పీఎం10 కాలుష్యంలో 1.5 ట‌న్నుల కాలుష్యం..పీఎం 2.5లో 0.4టన్నుల కాలుష్యం ప్ర‌తి ఏడాది త‌గ్గుతుంద‌ని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. వాహనాల ఇంజిన్లను రెడ్ సిగ్నల్ దగ్గర ఆపివేయడం వలన కాలుష్యం తగ్గడం మాత్రమే కాకుండా ఫ్రతి ఏటా ఒక్కో వాహనానికి 7వేల రూపాయలు ఆదా కూడా అవుతాయని కేజ్రీ చెప్పారు.



ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో కాలుస్తున్న పంటల వ‌ల్ల సుమారు 4 శాతం కాలుష్యం ఏర్ప‌డుతుంద‌ని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి జ‌వ‌దేక‌ర్ వెల్ల‌డించార‌ని, 15 రోజుల క్రితం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సాధార‌ణంగా ఉంద‌ని, అయితే గ‌డిచిన 15 రోజుల్లో ఎందుకింత కాలుష్యం పెరిగిందో తెలుసుకోవాల‌ని ఈ సందర్భంగా ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఆయ‌న అన్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో కాలుష్యాన్ని చెక్ చేసేందుకు సీపీసీబీ 50 బృందాల‌ను ఏర్పాటు చేసింద‌ని, పంట కొయ్య‌ల‌కు మంట‌పెట్ట‌డం వ‌ల్ల 4 శాతం కాలుష్యం ఏర్ప‌డుతుంద‌ని, దుమ్ముధూళి, నిర్మాణ‌, బ‌యోమాస్ వ‌ల్ల కాలుష్యం పెరుగుతున్న‌ట్లు కేంద్ర మంత్రి జ‌వ‌దేక‌ర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.



మరోవైపు , క్లీన్ ఢిల్లీలో భాగంగా ఢిల్లీలో చెట్లను కాపాడేందుకు ట్రీ ప్లాంటేష‌న్ పాలసీకి కూడా ఢిల్లీ కేబినెట్ ఇటీవల ఆమోదముద్ర వేసింది. ఈ పాలసీలో భాగంగా ఏదైనా నిర్మాణానికి లేదా డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టుల కోసం ఒక‌వేళ చెట్ల న‌రికివేత కొన‌సాగితే, దాంట్లో క‌నీసం 80 శాతం వృక్షాల‌ను మ‌రోచోట తప్పనిసరిగా నాటాలి. 80 శాతం నాటబడిన చెట్లు బతికితేనే ట్రాన్స్‌ప్లాంటేష‌న్ ఏజెన్సీకి పేమెంట్ ఇస్తామ‌ని కేజ్రీవాల్ స్ప‌ష్టం చేశారు. జాతీయ స్థాయిలో ట్రాన్స్ ప్లాంటేష‌న్ ఏజెన్సీల‌ను ఏర్పాటు చేసేందుకు ప్యాన‌ల్‌ ను నియ‌మిస్తున్న‌ట్లు సీఎం చెప్పారు. అంతేకాకుండా కొత్త పాలసీ కింద.. ఓ డెడికేటెడ్ ట్రీ ప్లాంటేషన్ సెల్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. RWA సభ్యులున్న స్థానిక కమిటీలు,నివాసితులు నాటబడిన చెట్లను మానిటర్ చేస్తారని కేజ్రీవాల్ తెలిపారు.