భార్య బొట్టు, గాజులు వద్దనుకుంటే ఆ పెళ్లిని తిరస్కరించినట్లే, హైకోర్టు సంచలన తీర్పు, ఆమె భర్తకు విడాకులు మంజూరు

భార్య బొట్టు, గాజులు వద్దనుకుంటే ఆ పెళ్లిని తిరస్కరించినట్లే, హైకోర్టు సంచలన తీర్పు, ఆమె భర్తకు విడాకులు మంజూరు

పెళ్లి తర్వాత పాపిట(నుదట) సింధూరం(బొట్టు), చేతులకు గాజులు ధరించేందుకు అంగీకరించకపోతే వధువు ఆ వివాహాన్ని తిరస్కరించినట్టేనని గౌహతి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సింధూరం ధరించడం, గాజులు తొడుక్కోవడం అనేది హిందూ వధువు పాటించే ఆచారాలని, వరుడితో వివాహాన్ని అంగీకరిస్తున్నట్టు ఇవి సూచిస్తాయని కోర్టు చెప్పింది. విడాకుల కోసం ఓ భర్త వేసిన పిటిషన్‌కు సంబంధించి ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఈ కారణాలతో ఆ భర్తకు కోర్టు విడాకులు కూడా మంజూరు చేసింది.

పెళ్లయిన నెల రోజులకే భర్తతో గొడవ:
అస్సాంకు చెందిన ఓ జంటకు 2012లో పెళ్లి అయింది. కానీ వివాహమై నెల తిరగకముందే వధువు కొత్త డిమాండ్లు పెట్టింది. అత్తమామలతో కలిసి ఉండేందుకు ఆమె నిరాకరించింది. దీనికి భర్త ఒప్పుకోలేదు. అదే సమయంలో ఆమెకు పిల్లలు కూడా కలగకపోవడంతో వారి మధ్య బంధం మరింత బలహీనపడింది. ఈ క్రమంలో 2013లో ఆమె భర్త ఇంటిని వదిలి విడిగా ఉండటం ప్రారంభించింది. ఆ సమయంలో భర్త, అతడి కుటుంబ సభ్యులపై గృహహింస చట్టం కింద కేసు కూడా పెట్టింది. అయితే హైకోర్టు అప్పట్లో ఈ కేసును కొట్టేసింది.

హిందూ సంప్రదాయాన్ని, ఆచారాన్ని గౌరవించడం లేదు:
ఆమె తీరుతో విసిగిపోయిన భర్త విడాకులు తీసుకోవాలని భర్త నిర్ణయించాడు. విడాకులు కోరుతూ తొలుత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య నుదుట సింధూరం పెట్టుకోవడం లేదని, చేతులకు గాజులు వేసుకోవడం లేదని, తమ సంప్రదాయాన్ని, పెళ్లిని ఆమె గౌరవించడం లేదని ఆరోపించాడు. అవివాహిత మహిళగానే కనబడేందుకు ప్రయత్నించిందని చెప్పుకొచ్చాడు. తన భార్య విడిగా ఉంటోందని, దీంతో తమకు సంతానం కూడా కలగలేదని తన పిటిషన్‌లో తెలిపాడు. ఈ చర్యలతో తాను ఓ భర్తగా అవమానం పాలయ్యాయని వాపోయాడు. భార్య తనను వేధిస్తోందని ఆరోపించాడు. అయితే ఫ్యామిలీ కోర్టు అతడి విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది.

బొట్టు పెట్టుకునేందుకు ఇష్టపడకపోతే పెళ్లిని తిరస్కరించినట్టే:
దీంతో ఆ భర్త గౌహతి హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం జూన్ 19న సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి అయిన హిందూ మహిళ సంప్రదాయం ప్రకారం తన నుదుట సింధూరం పెట్టుకోవడానికి, చేతులకు గాజులు తొడిగేందుకు ఇష్టపడకపోతే భర్తతో జరిగిన వివాహాన్ని ఆమె తిరస్కరించినట్లుగా భావించాల్సి వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెతో కలిసి కాపురం చేయాలని దిగువ కోర్టు భర్తను ఆదేశించడం అతడిని హింసించడమేనని వ్యాఖ్యానించింది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు కింది కోర్టు తీర్పును కొట్టేసింది. ఆ భర్తకు విడాకులు మంజూరు చేసింది. భర్త అతడి కుటుంబ సభ్యులపై నిరాధార ఆరోపణలు చేయడం, కేసులు వేయడం వేధింపుల కిందకే వస్తాయని కోర్టు స్పష్టం చేసింది.

Read:కృష్ణుడే కరోనాను భూమ్మీదకు పంపించాడు…