ఓటీటీల్లో పోర్నోగ్రఫీని కూడా చూపిస్తున్నారు..కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఓటీటీల్లో పోర్నోగ్రఫీని కూడా చూపిస్తున్నారు..కేంద్రానికి సుప్రీం నోటీసులు

OTT అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓవర్‌ ది టాప్‌ (OTT) ప్లాట్‌ఫామ్‌లపై నియంత్రణ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఓటీటీలకు నియంత్రణలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమావళిని రేపటిలోగా తమకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

తాండవ్ వెబ్ సిరీస్ వివాదం నేపథ్యంలో భారత్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో కమర్షియల్ హెడ్ అపర్ణ పురోహిత్‌ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడంతో… ఈ విషయంపై అపర్ణ పురోహిత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఇవాళ చేపట్టిన సుప్రీం బెంచ్.. తీర్పును రేపటికి వాయిదా వేసింది. తాండ‌వ్ వెబ్‌సిరీస్‌లో హిందువుల మనోభావాలను కించపరిచినట్లు ఆరోపణల నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఎగ్జిక్యూటివ్‌పై యూపీ ప్ర‌భుత్వం కేసు బుక్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఇంటర్నెట్ లో మరియు ఓటీటీల్లో సినిమాలు చూడటం ఈ రోజుల్లో సాధారణమైపోయిందని ఇవాళ అపర్ణ పురోహిత్‌ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో ప్ర‌సారం అవుతున్న వీడియోల‌ను స్క్రీనింగ్ చేయాల్సి అవ‌స‌రం ఉంద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొన్ని ఓటీటీ సంస్థలు అశ్లీల వీడియోలను సైతం ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా ప్రసారం చేస్తున్నాయని, సమాజంపై దాని ప్రభావం ఉంటుందని సుప్రీం తెలిపింది. అలాంటి వాటిని అడ్డుకునేందుకు ఒక విధానం అవ‌స‌ర‌మ‌ని కోర్టు పేర్కొన్న‌ది. కనుక కేంద్ర ప్రభుత్వం ఓటీటీల కోసం ఎలాంటి మార్గదర్శకాలు సిద్ధం చేసిందో తమకు వాటిని రేపటిలోగా అందజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది కోర్టు. ఎలాంటి తరహా నియంత్రణ ఉండబోతుంది, ఏ విషయాలను ఓటీటీ నియమావళిలో చేర్చారో తెలుసుకునేందుకు తమకు పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు తన ఆదేశాలలో పేర్కొంది.