Reliance AGM 2021 : జియో 5G నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు..ముఖేష్ అంబానీ ప్రసంగంలోని హైలెట్స్ ఇవే

రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)...

Reliance AGM 2021 : జియో 5G నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు..ముఖేష్ అంబానీ ప్రసంగంలోని హైలెట్స్ ఇవే

Ambani

Reliance AGM 2021 : రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM) ఇవాళ మధ్యాహ్నాం ప్రారంభమైంది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది లానే ఈసారి కూడా డిజిటల్ పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యుల ఆత్మ శాంతికై రిలయన్స్ ఏజీఎం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఆ తర్వాత నీతా అంబానీ,ఆకాష్ అంబానీ,ఇషా అంబానీ ప్రసంగించారు.

అనంతరం కంపెనీ వాటాదారులను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రసంగిస్తూ..రిలయన్స్ ఇండస్ట్రీస్ గడిచిన ఏడాది కాలంలో అంచనాలకు మించి రాణించింది. కోవిడ్ లాంటి సవాలు వాతావరణంలో కంపెనీ పనితీరు అత్యుత్తమంగా ఉంది. వినియోగదారుల వ్యాపారాల నుండి గణనీయమైన పెరుగుదలతో మా ఏకీకృత ఆదాయం దాదాపు 5,40,000 కోట్లు. మా ఏకీకృత EBITDA దాదాపు రూ .98,000 కోట్లు, EBITDA లో దాదాపు 50% వినియోగదారుల వ్యాపారాలు అందించాయి. ప్రపంచమంతా కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొటోన్న సమయంలో కూడా రిలయన్స్ గత సంవత్సరంలో దాదాపు 75,000 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. ఆర్‌ఐఎల్ భారతదేశపు అతిపెద్ద వస్తువుల ఎగుమతిదారుగా కొనసాగుతోంది. ప్రైవేటు రంగంలో కస్టమ్స్ ,ఎక్సైజ్ సుంకాలను అత్యధికంగా చెల్లించే కార్పోరేట్ సంస్థగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈక్విటీ క్యాపిటల్‌లో రూ .3.24 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించాము. రిటైల్ వాటాదారులు రైట్ ఇష్యూపై 4x రాబడిని పొందడం ఆనందంగా ఉందన్నారు. అయితే, ఈ వృద్ధితో పోలిస్తే దేశం గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న ఈ కాలంలో సంస్థ చేపట్టిన సహాయ కార్యక్రమాలే తనకు అత్యంత సంతృప్తినిచ్చాయని ముఖేష్ అంబానీ అన్నారు.

రిలయన్స్ బోర్డులో వ్యూహాత్మక భాగస్వామిగా సౌదీ అరాంకో సంస్థని ఆహ్వానిస్తున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. సౌదీ అరాంకో ఛైర్మన్ , పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యన్ స్వతంత్ర డైరెక్టర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో చేరడం సంతోహంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఫైనాన్స్, టెక్నాలజీలో ఆయన కృషి చాలా విలువైనదని.. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీగా సౌదీఅరాంకోకు పేరు ఉందన్నారు. అంతేకాదు అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటైన ఈ సంస్థ అనుభవం నుండి తాము ఎంతో ప్రయోజనం పొందుతామని తనకు తెలుసన్నారు. యాసిర్ అల్-రుమయ్యన్ బోర్డులో చేరడం కూడా రిలయన్స్ అంతర్జాతీయీకరణకు నాంది అన్నారు. రాబోయే కాలంలో రిలయన్స్ అంతర్జాతీయ ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.

ఇక,గూగుల్, జియో సంయుక్తంగా అభివృద్ధి చేసిన JIO PHONE NEXT ను సెప్టెంబర్ 10న ప్రారంభించినట్లు RIL చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. గూగుల్ , జియో జట్లు సంయుక్తంగా జియో ఫోన్ నెక్స్ట్ అని పిలువబడే స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేశాయి. జియో ఫోన్ నెక్స్ట్ పూర్తిగా ఫీచర్ చేసిన స్మార్ట్‌ఫోన్, గూగుల్ , జియో రెండింటి నుండి మొత్తం సూట్ యాప్స్ కు మద్దతు ఇస్తుంది. జియో ఫోన్ నెక్స్ట్..ఆండ్రాయిడ్ , అత్యంత ఆప్టిమైజ్ సామర్థ్యంతో పనిస్తుంది ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ , ముఖ్యంగా భారత మార్కెట్ కోసం అభివృద్ధి చేయబడింది. ఈ ఫోన్ లో వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ , ఆటోమేటిక్ రీడ్, ట్రాన్స్ లేషన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌లతో కూడిన స్మార్ట్ కెమెరా వంటి ఫీచర్స్ ఉంటాయి. ఇప్పటివరకు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ గా నిలవనుంది.

జియో..భారత్ ను 2G ముక్త్ మరియు 5G యుక్త్ గా మారుస్తుందని ముఖేష్ అంబానీ తెలిపారు. గూగుల్-జియో మధ్య భాగస్వామ్యం 100కోట్ల మందికిపైగా భారతీయులకు వేగవంతమైన ఇంటర్నెట్ పొందటానికి,డిజిట్ ల్ పద్దతిలో వ్యాపారాలకు మద్దతివ్వడంలో,భారతదేశపు తదుపరి దశ డిజిటైజేషన్ లో ఓ పునాదిని వేయడంలో గూగుల్ క్లౌడ్-జియో మధ్య కొత్త పార్టనర్ షిప్ సాయపడుతుందన్నారు. ఇక, జియో మార్ట్ ని వాట్సాప్ తో ఇంటిగ్రేట్ చేసేందుకు ఫేస్ బుక్ తో జియో ట్రయల్ రన్ నిర్వహిస్తుందని తెలిపారు. నేవీ ముంబైలో జియో ఇనిస్టిట్యూట్ ని స్థాపిస్తున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో ఇనిస్టిట్యూట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందిస్తామన్నారు.

రాబోయే 3 సంవత్సరాల్లో కొత్త గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో 60,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. జామ్‌నగర్‌లోని 5,000 ఎకరాల్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేసే పనిని తాము ప్రారంభించామని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన తయారీ సౌకర్యాలలో ఒకటి అవుతుంది.

రిలయన్స్ రిటైల్ ద్వారా వచ్చే 3 సంవత్సరాలలో 10 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టి ఉంటుందని ముఖేష్ అంబానీ చెప్పారు. రాబోయే మూడేళ్లలో రిటైల్ సంస్థ 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని అంబానీ తెలిపారు. 3 సంవత్సరాలలో 1 కోటి మంది కొత్త విక్రేతలను చేర్చుకోవాలని భావిస్తున్నామన్నారు. వచ్చే మూడు నుండి ఐదు సంవత్సరాలలో 3 రెట్ల వృద్ధిని ఆశిస్తున్నామన్నారు. “ప్రపంచంలోని టాప్ 10 రిటైలర్లలో ఒకరిగా ఉండాలని కోరుకుంటున్నాను” అని అంబానీ చెప్పారు.

మరోవైపు, భవిష్యత్ టెక్నాలజీస్ మరియు వాల్యూ చైన్ పార్టనర్ షిప్ లో 51వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఫ్లాన్ చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు.